జగన్ కాంగ్రెస్ హస్తం అందుకొంటాడా లేదా?

 

ఇంతకాలం జగన్ మోహన్ రెడ్డిని అవినీతిపరుడంటూ జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ సిగ్గు బిడియం, నీతి నియమం అన్నీకూడా పక్కన పెట్టేసి ఇప్పుడు అదే జగన్ తో చేతులు కలుపుదామని తహతహలాడిపోతోంది. అయితే, జైల్లో మగ్గిపోతున్నపటికీ జగన్ వైపు నుండి ఇంతవరకు సానుకూలంగా స్పందన రాలేదు. ఇంతకీ జగన్ కాంగ్రెస్ ‘హస్తం’ అందుకొంటాడా లేక బెయిలు కోసం చంద్రుని కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉండిపోతాడా? అని ఆలోచిస్తే కొన్ని ఆసక్తికరమయిన అంశాలు కనబడతాయి.

 

తనని జైల్లోవేసి దుర్బర జీవితాన్నిరుచి చూపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయందించినంత మాత్రాన్నఅందుకొనడానికి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తి చూపకపోవచ్చును. ఎందుకంటే, ఇప్పటికే అతను 8 నెలలుగా ఏ విచారణ ఎదుర్కోకుండా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు. ఒక పక్క, తనకు ప్రభుత్వం సహకరించట్లేదని సిబిఐ స్వయంగా కోర్టుకు చెపుతుంటే, మరో వైపు జగన్ తరపు లాయర్లు సిబిఐకు సహకరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుండే జాప్యం చేస్తున్నందున తమ క్లయింటు జగన్ మోహన్ రెడ్డికి తీరని అన్యాయం జరుగుతోందని కోర్టుకి స్పష్టం చేస్తూ అతని బెయిలు కోరుతున్నారు. అందువల్ల, ఈ రోజు కాకపోయినా రేపయిన తనకి కోర్టే స్వయంగా బెయిలు మంజూరు చేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న జగన్, ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ సాయం తీసుకొని దానికి ప్రయోజనం చేకూర్చడం ఎందుకని ఆలోచిస్తూ ఉండవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంవల్ల, ఇంతకాలం చేసిన పోరాటం వృధా అవడమే కాకుండా, ప్రజల ముందు విస్వసనీయతగురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన తమ పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల ముందుకు వెళ్ళినట్లయితే తమ ‘విస్వసతనీయత’ కి కళంకం అంటుకొంటుందని ఆయన భావిస్తూ కాంగ్రెస్ కి దూరంగా ఉండిఉండవచ్చును.

 

ఇక, రాష్ట్ర రాజకీయాలలో తన ప్రాభల్యాన్ని సరిగ్గానే అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీకి తన అవసరం ఉంది తప్ప తనకి ఆ పార్టీ అవసరం లేదని జగన్ గుర్తించడం మరో కారణం కావచ్చును. తనతో చేతులు కలిపితే, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారం కైవసం చేసుకొని లాభ పడుతుంటే, కేసుల నుండి బయట పడటం తప్ప తనకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదని జగన్ మోహన్ రెడ్డి భావించడం వల్ల కాంగ్రెస్ సంకేతాలకు సానుకూలంగా స్పందించట్లేదని అనుకోవచ్చును. అందువల్ల కొంత కాలం వేచి చూసి పరిస్థితులను బట్టి ఎన్నికల పొత్తుల గురించి స్పందించడం మేలని జగన్ భావిస్తుండవచ్చును.

 

ఇక కాంగ్రెస్ వైపు నుంచి ఆలోచిస్తే, ఎన్నికలకి ఇంకా చాలా సమయమే ఉంది కనుక, ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డి తో తొందరపడి చేతులు కలుపకపోయినా నష్టం లేదు. గానీ, సూచన ప్రాయంగా ఇప్పటి నుండే అతనితో పొత్తుల గురించి మాట్లాడుతుంటే ప్రజలు కూడా ఎన్నికల సమయానికి మానసికంగా వారి ఎన్నికల పొత్తులని అంగీకరించే స్థాయికి వస్తారని ఆలోచనతోనే కాంగ్రెస్ ఈ ప్రస్తావన తెస్తోందని భావించవచ్చును. ప్రజలతో బాటు, జగన్ మోహన్ రెడ్డి అతని పార్టీ కూడా అందుకు మానసికంగా సిద్దపడేలా చేయడం కూడా కాంగ్రెస్ ఉద్దేశం కావచ్చును.

 

మరి కొంత కాలం అతనికి బెయిలు రాకుండా అడ్డుపడుతూ జైల్లోనే మగ్గనిచ్చి అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటిపోయేవరకు ఆగి, ఇక అతనంతట అతనే ‘ప్రాహీ..ప్రాహీమాం..’ అంటూ తన కాళ్ళమీద పడేలా చేసుకోగలిగితే, అప్పుడు అతనితో తనకి నచ్చినట్లు ఆడుకోవచ్చుననే కాంగ్రెస్ ఆలోచన చేస్తుండవచ్చును. ప్రస్తుతం కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా వేచి చూసే ధోరణితో ఉన్నాయని చెప్పవచ్చును.