రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. మంత్రి లోకేష్

posted on: Feb 23, 2026 4:23PM

ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో (కేజీబీవీ) ఫలితాల నుండి ఉపాధ్యాయుల నియామకాల వరకు పలు కీలక అంశాలపై ఆయన అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. 
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లు, ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్న మంత్రి  గత రెండు  సంవత్సరాలుగా ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. 

కేజీబీవీ సిబ్బంది జీతాల పెంపు మరియు ఇతర సౌకర్యాలపై వివరణ ఇస్తూ , కేజీబీవీ అనేది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిధులు ఇచ్చే పథకమని చెప్పిన లోకేష్.. జీతాలు పెంచాలంటే కేంద్రం ఇచ్చే బడ్జెట్ కేటాయింపులు పెరగాలనీ, దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి చర్చించినట్లు చెప్పారు.  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే కేజీబీవీ సిబ్బందికి ఎక్కువ జీతాలు ఇస్తున్నామన్న ఆయన కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే  జీతాలు పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 

ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న డీఎస్సీ,  ఇతర ఉద్యోగాల భర్తీపై మాట్లాడిన ఆయన గత ఏడాది 16,000 మంది ఉపాధ్యాయులను నియమించామన్నారు.  ఉగాది నాటికి 'మెగా జాబ్ క్యాలెండర్' విడుదల చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.   ఈ క్యాలెండర్‌లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉంటాయన్నారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూనే, ఉపాధ్యాయులు,  నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...