రంగులంటే జీవితమోయ్


రంగుల పండుగ అంటే అందరికి ఇష్టమే... రకరకాల రంగులతో ఆనందాన్ని పంచుకుంటాం. అయితే ఆ రంగులు మన మీద చూపించే ప్రభావం గురించి ఎప్పుడు అయినా ఆలోచించారా. అవి మన భావోద్రేకాల మీద, ఆలోచనల మీద, మానసిక స్థితిగతుల మీద చాలా ప్రభావాన్ని చుపిస్తాయని ఎన్నో అధ్యయనాలలో తేలింది.

కలర్ స్పెషలిస్ట్  Leatrice Eiseman ప్రకారం ప్రకృతిలోని ప్రతి రంగుతో మనకి చిన్న నాటినుంచి ఏదో ఒక అనుబంధం, జ్ఞాపకం ముడిపడి వుంటుంది. అందుకే మనకి తెలియకుండానే ఆ రంగులు మన మానసిక భావోద్వేగాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి.  సహజంగా నీలం రంగు అనగానే మనకి ఆకాశం గుర్తుకొస్తుంది.  ఆకాశం అంటే దాని నీడలో చిన్నప్పటి ఆటపాటలు  మదిలో మెదులుతాయి. ఉషారుగా అనిపిస్తుంది. అందుకే నీలం రంగు ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఏ ఏ రంగులు మనకి అనుకూల ఫలితాలని అందిస్తాయో సరదాగా చెప్పుకుందాం.


1. ఉదయాన్ని ఆరంజ్‌తో ప్రారంభించాలి

ఆరంజ్  చైతన్యాన్ని, ఆసక్తి ని కలిగించే గుణం కలిగింది . ఎరుపు , పసుపు కలయిక  ఈ వర్ణం.  అందుకే ఎరుపులోని  ఉద్వేగం, పసుపులోని ఆనందం అందిస్తుంది ఈ రంగు .  ఆరంజ్ ఆక్సిజన్ సప్లైని పెంచుతుందని, దాని వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని ఎన్నో అధ్యయనాలు ప్రూవ్ చేశాయి. అందుకే ఉదయాన్నే ఆరంజ్ రంగు బట్టలు వేసుకుని ఉదయించే సూర్యుడిని చూస్తూ మార్నింగ్ వాక్ చేయండి. రోజంతా సంతోషంగా, ఉషారుగా గడపండి అంటున్నారు పరిశోధకులు.

2. ముఖ్యమైన పనులకి... ఎరుపు

ఎరుపు ఇట్టే ఆకర్షించే గుణం కలిగినది. ఎంత దూరంలో వున్నా ఎదుటివారి చూపుని కట్టి పడేస్తుంది. అది కాక ఎరుపు ఉత్సాహానికి, ఉద్వేగానికి ప్రతిక. ఈసారి ముఖ్యమైన పనుల మీద వెళ్లినప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. అక్కడ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు . 

3. ఒత్తిడి ఎక్కువగా వుంటే... నీలం

నీలానికి రిలాక్స్ చేసే గుణం వుంది. అందుకే ఒత్తిడి ఎక్కువగా వున్నప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి చూడండి. మనసుకు హాయిగా వుంటుంది. అలాగే ఆఫీస్ టేబుల్ మీద నీలం రంగులో ఓ ఆబ్జెక్ట్ పెట్టి, అప్పుడప్పుడు దానిని చూస్తుండండి. ఏకాగ్రతని, చురుకుదనాన్ని అందించే ఈ రంగు పనిలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

4. ఏదన్నా సాధించాలంటే... నలుపు

నలుపు aggressiveగా కనిపించేలా చేస్తుంది. తెలియకుండానే ఆత్మవిశ్వాసం స్వంతమవుతుంది. ముఖ్యమైన వ్యక్తులని కలిసేటప్పుడు, మీ ప్రభావం ఉండేలా ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు, నలుపు ధరించి చూడండి... ఆ ఫలితం ఎలా ఉంటుందో. నలుపు దూకుడుగా ఉండేందుకు ప్రేరేపిస్తుంది.

5. ఆకుపచ్చ... ఆశయానికి ఊపిరి పోస్తుంది

పచ్చదనం అంటేనే జీవం వున్నట్టు.  ఆశని కలిగించే గుణం దీని స్వంతం. ఆకుపచ్చ ప్రకృతికి ప్రతీక అందుకే ఇంట్లో, ఆఫీస్‌లో పచ్చని మొక్కలని ఉంచుకోండి.  వాటిని చూస్తుంటే రిలాక్స్ అవుతారు. ఆలోచనలు ఓ కొలిక్కి వస్తాయి. కానీ  ఫ్రెండ్స్‌తో బయటకి వెళ్ళేటప్పుడు, బాయ్ ఫ్రెండ్‌ని, లేదా గర్ల్ ఫ్రెండ్‌ని కలిసేటప్పుడు ఈ రంగు బట్టలు వేసుకోకుండా చూసుకోండి. తెలియని గాంభీర్యం ఆవహిస్తుంది. చిన్న పిల్లల్లా ఆడి పాడాలంటే నీలం, ఆరంజ్ పర్ఫెక్ట్ కలర్స్.

ఎన్నెన్నో వర్ణాలు.. అన్నిట్లో అందాలు... కొన్ని వర్ణాల గురించే చెప్పుకున్నాం కానీ రంగుల ప్రభావం వెనుకున్న సైన్సు మీకు అర్థమయ్యే వుంటుంది. ఈసారి మీరు వేసుకునే రంగు మీ మూడ్ మీద చూపించే ప్రభావాన్ని గమనించండి.  నెమ్మదిగా మీకే  అర్థం అయిపోతుంది ఏ రంగు ఎప్పుడు వేసుకోవచ్చో.

అన్ని వర్ణాలూ మీకు సంతోషాన్ని అందించాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు.

-రమ