మంచిని చెడు పదాలతో చెబితే... ఫలితం చెడిపోతుంది!

 

వ్యక్తిగతంగా మనకు ఎన్నైనా అభిప్రాయాలుండవచ్చు. కాని, ఒక బాధ్యత గల పదవిలోకి వచ్చాక మనం ఏం మాట్లాడినా జనం అ పదవి నేపథ్యంలోనే చూస్తారు. ఇది కాదనలేని సత్యం. కాని, చాలా మంది ప్రముఖులు పదే పదే ఒకే తప్పు చేస్తుంటారు. సరైంది అయినా, కాకపోయినా తమ ఒపీనియన్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంటారు. ఆ పని సామాన్యులు చేస్తే బాగానే వుంటుంది. కాని, ఒక స్థాయి వచ్చాక కూడా అలా చేస్తూ పోతే అనవసరపు రాద్ధాంతం తప్పదు!

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అకునూరి మురళి ఏం మాట్లాడారో అందరికీ తెలిసిందే! నిజానికి ఆయన మాట్లాడినదంతా మన దేశంలో భావప్రకటనా స్వాతంత్ర్యం కిందకి వస్తుంది. కాని, అసలు సమస్య ఒక కలెక్టర్ అయ్యి వుండీ అలా పబ్లిగ్గా మాట్లాడటం సబబా? అదీ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బ్రాహ్మణిజం లాంటి పదాలు వాడటం, హిందూ మతాన్ని కించపరిచేలా పిచ్చి మాలాలు అనటం కరెక్టేనా? ఎవరో యూనివర్సిటీలో కూర్చుని మాట్లాడే మేధావి అయితే ఎవ్వరూ పెద్దగా ఆక్షేపణ పెట్టరు. కాని, మురళీ ఒక జిల్లాకి ప్రభుత్వం తరుఫున నియమింపబడ్డ కలెక్టర్. మరి ఆయన ఇలా ఒక వర్గం, ఒక మతం పట్ల అసహనంతో కూడిన మాటలు మాట్లాడితే ఎలా? వాటిలోని సారాంశం సరైందే అని ఒక క్షణం పాటూ భావించినా... చెప్పాల్సిన పద్ధతంటూ ఒకటి వుంటుంది కదా? పదాలు వాడేటప్పుడు ఆలోచించుకోవాలి కదా?

 

అసలు పెద్ద మాంసం తినండీ అని ఒక ప్రభుత్వ ప్రతినిధి అనవచ్చా? దాంట్లో వుండే లాభాలు ఎలా వున్నా మన దేశంలో రాజ్యాంగం ప్రకారం పశు సంపద ఖచ్చితంగా కాపాడబడాలి. గోవులు, బర్రెలు, ఎడ్లు వంటివి వదించటం కుదరదు. అయినా కూడా జనాల ఆహారపు అలవాట్ల ప్రకారం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో కబేళాలు నడుస్తూనే వుంటాయి. గో సంరక్షణ బీజేపియేతర పార్టీలు అధికారంలో వున్న చోట్ల పెద్దగా జరగదనే విషయం అందరికీ తెలిసిందే. ఇక బీజేపి అధికారంలో వున్నా గోవా లాంటి రాష్ట్రాల్లో బీఫ్ పుష్కలంగా లభిస్తూనే వుంది. కాబట్టి గోవు, ఎద్దు, బర్రె మాంసాలు జనం అస్సలు తినలేకపోతున్నారన్నది అబద్ధం. అలాగే, కలెక్టర్ గారు అడవి పందిని కూడా వేటాడి తినండని పిలుపునిచ్చారు. అందులో పోషకాలు పుష్కలంగా వుంటే వుండవచ్చు గాక... కాని, ప్రత్యేకంగా తినమని ప్రొత్సహించటం ఎందుకు? తినమని చెప్పేవారు చెప్పినప్పుడు... వద్దని చెప్పే వారు కూడా తమ పని తాము చేస్తారు కదా? ఆ విషయంలో మాత్రం బ్రాహ్మణిజం అన్న పదం వాడుతూ... బ్రాహ్మణుల మీద అసహనానికి గురైతే ఎట్లా ? పోనీ ఇప్పటి వరకూ బ్రహ్మణులు గో మాంసం తినవద్దని ఎక్కడైనా దాడులు చేశారా? అలాంటి దాఖలాలు ఎక్కడా లేవు!

 

మురళీ మాట్లాడిన మాటల్లో అత్యంత  ఆక్షేపనీయ వ్యాఖ్యలు పిచ్చి మాలలు అనటం! దేవుడ్ని పూజించటం, మాలలు వేసుకోవటం జనం తాలూకూ వ్యక్తిగత స్వేచ్ఛ! దాన్ని ఎవ్వరూ విమర్శించటానికి లేదు. అలాగే, ఆయన చెప్పిన మాంసాహారం మానేయటం కూడా మాలలు వేసుకోవటం వల్ల ఆగిపోవటం లేదు. ఏ మాలైనా 40రోజులు వేసుకుంటారు. సంవత్సరంలోని మిగతా రోజులన్నీ మాంసాహారం తినటానికే చాన్స్ వుంది. మరప్పుడు హిందువుల మనోభావాలకు సంబంధించిన మాలలపై పిచ్చి మాలలు అన్న పద ప్రయోగం సమంజసమేనా? అసలు ఇలా వేరే మతాల వారి ఆచారాల్ని, సంప్రదాయాల్ని, వ్రతాల్ని, దీక్షల్ని కలెక్టర్ స్థాయిలో వుండి టార్గెట్ చేయగలరా?

 

వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ మురళీ వెంటనే క్షమాపణలు కూడా చెప్పారు. దాంతో సమస్య సద్దుమణిగిందనే చెప్పొచ్చు. కాని, ప్రభుత్వ ప్రతినిధులుగా వున్న వారు ఇక నుంచైనా బాధ్యతగా సరైన పదాలు ఎంపిక చేసుకుని తమ భావాలు వ్యక్తం చేస్తే బావుంటుంది! అదే వారి స్థాయికి హుందాగా వుంటుంది. సమాజానికి కూడా లాభదాయకంగా వుంటుంది!