కిరణ్ ను కలవరపెట్టిన జగన్ తో అసదుద్దీన్ భేటీ

ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికలు, మరోవైపు 2012 ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయభేరి రాష్ట్రంలో చర్నోపచర్చలకు దారితీశాయి. రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. ఈ తరుణంలో ఎం.ఐ.ఎం. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెంచల్ గూడ జైలుకు వెళ్ళి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని కలిశారు. జైలు అధికారుల నుంచి ములాఖాత్ అనుమతి పొందిన ఆయన జగన్ తో గంటసేపు గడిపారు. అప్పుడు జగన్ ఆరోగ్యపరిస్థితి, జైలువాతావరణం, సిబీఐ విచారణ తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రాజకీయపరిణామాల గురించి కూడా వీరిద్దరి మధ్య చర్చ నడిచింది. ఈ చర్చ రాజకీయసమీకరణల్లో ఏమైనా కొత్త అంకానికి తెరలేస్తుందన్న సందేహానికి తావిచ్చింది. భవిష్యత్తులో బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న ఎం.ఐ.ఎం., రాష్ట్రంలో అధికారాన్ని కోరుకుంటున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల మధ్య అంతర్లీనంగా ఎప్పుడైనా ఒప్పందం చేసుకోవటానికి ఈ సమయాన్ని జగన్, అసదుద్దీన్ ఉపయోగించుకోవచ్చనే కొత్త ఊహలకు ఆస్కారమేర్పడింది. అయితే ఈ ఊహలేమీ నిజం కాదన్నట్లు అసదుద్దీన్ జైలు నుంచి బయటకు వచ్చి తాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వమని జగన్ ను కోరానన్నారు. అయితే అసదుద్దీన్ 2014 వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగేందుకు ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. అయితే ఊహించని పరిణామాలు ఏమైనా జరిగితే తమను నినదించవద్దని ఆయన కోరారు. అంటే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన ఎం.ఐ.ఎం. జగన్ ను అసదుద్దీన్ కలిశాక మద్దతు ఉపసంహరించుకునే ఆలోచన కూడా చేయొచ్చని ఆ మాటలో గూఢార్థం బయటపడుతోంది, కాంగ్రెస్ బలం తగ్గితే తనవైపు చూస్తుందని జగన్ భావించి ఉండవచ్చని కూడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా రాష్ట్రవ్యాప్తంగా కొత్తబంధానికి తెరలేపేందుకు అసదుద్దీన్, జగన్ మిలాఖాట్ జరిగి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అదెంతవరకూ నిజమో తెరపైనే చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu