చంద్రబాబును వెనకేసుకు వచ్చిన కిరణ్, బోత్సల అంతర్యం ఏమిటో?

 

నిన్న జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఇద్దరూ కూడా మొట్టమొదటిసారిగా తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని కొంచెం మెచ్చుకొంటూ మాట్లాడటం విశేషం. తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తెరాస మరియు వైకాపాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాలకు తెదేపా మద్దతు ఈయని కారణంగానే వారు ఆశించని, ఊహించని ఆ మర్యాదలు ఒలకబోస్తున్నారని అందరూ భావిస్తున్నారు.

 

అయితే, వాటి వెనుక ఇంకా బలమయిన కారణాలే ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్తిబాబులు ఇద్దరూ కూడబలుకొన్నట్లుగా చంద్రబాబుకి, తేదేపాకు అనుకూలంగా మాట్లాడటం ద్వారా, ఇప్పటికే తెర వెనుక నుండి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారిగా రహస్య ఒప్పందం చేసుకొని తమ అవిశ్వాస తీర్మానాలకు మద్దతు పలుకకుండా, కిరణ్ కుమార్ ప్రభుత్వం పడిపోకుండా కాపడుతున్నాడని చంద్రబాబు మీద విరుచుకు పడుతున్న తెరాస మరియు వైకాపాలకు మరింత అనుమానం కలిగేలా మాట్లాడి తద్వారా వారికి మరో కొత్త ఆయుధం అందించి వారిరువురినీ చంద్రబాబుపైకి ఉసిగొల్పడమే ప్రధాన లక్ష్యంగా కిరణ్, బోత్సలు మాట్లాడారు.

 

తద్వారా, మూడు ప్రధాన ప్రతిపక్షాల మద్య మరింత చిచ్చు రగిలించి వారిని ఒకరికొకరిని దూరంగా ఉంచగలిగితే, అది తమ పార్టీకి మేలు చేస్తుందనే దూరాలోచనతోనో లేక ‘దురాలోచానతో’నో వారిరువురూ ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చును. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా తన శత్రువుని పొరపాటున కూడా మెచ్చుకొనే అవకాశం లేదు. అటువంటి సమయంలో 2014 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయ చిత్ర పటం నుండి మాయమయిపోతుందని ఒకనాడు నొక్కి చెప్పిన ముఖ్యమంత్రే స్వయంగా ఈ రోజు తెలుగు దేశం పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమని, తెరాస, వైకాపా వంటి ప్రాంతీయ పార్టీలతో పోటీ పడవలసిన అవసరం లేదని పలకడం చూసినట్లయితే, ఆ మూడు పార్టీల మద్య తమ మాటలతో ఇప్పటికే ఉన్న పెద్ద అగాదాన్ని మరింత పెద్దది చేస్తే రాబోయే ఎన్నికలలో తమ పార్టీ నల్లేరు మీద నావలా సాగిపోవచ్చునని వారు ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చును.

 

తద్వారా ఇప్పటికకే తోక పార్టీలు, లోపాయికారీ పార్టీలు అంటూ కీచులాడుకొంటున్న ప్రతిపక్షాలకి, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, అంటూ కొత్తగా కొట్టుకు చచ్చే సౌలభ్యం కూడా వారికి కల్పించవచ్చునని వారిరువురీ ఆలోచన కావచ్చును.

 

తెలుగు దేశం పార్టీ పెద్ద పార్టీ అని, మిగిలిన రెండూ ప్రాంతీయ పార్టీలని వాటిమధ్య పోలిక పెట్టడం వెనుక ఉద్దేశ్యం కూడా అదే. రేపటి నుండి ఇదే విషయంపై ఆ మూడు పార్టీలు కత్తులు దూసుకొంటున్నపుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరూ చప్పట్లు కొడుతూ వెనక నుండి ప్రోత్సహించడం కూడా మనం చూడవచ్చును.