TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హస్తానికి బురద అంటకుండా పనికానిస్తోందా

Published on: Wed Oct 2, 2013 10:24AM

 

తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోజుకో కొత్త పధకం ప్రవేశపెడుతూ తన స్వంత ఇమేజ్ పెంచుకొనే ప్రయత్నాలు చేసారని స్వయంగా ఆయన క్యాబినెట్ మంత్రులే చాలా బాధపడ్డారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక ‘బంగారుతల్లి’ దెబ్బకి మంత్రి డీయల్ రవీంద్రా రెడ్డి తన పదవినే కోల్పోవలసి వచ్చింది.

 

ఇక ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే పాయె కనీసం హోంమంత్రి పదవయినా దక్కించుకొందామని ప్రయత్నించిన బొత్స, దామోదర రాజనరసింహలకు ముఖ్యమంత్రి సైంధవుడిలా అడ్డం పడినప్పటి నుండి వారూ ఆయన మీద కోపంగానే ఉన్నారు. తెలంగాణా వ్యతిరేఖిస్తున్నారనే వంకతో దామోదర రాజనరసింహులవారు ముఖ్యమంత్రిని తిట్టిన తిట్టు తిట్టకుండా రోజూ తిడుతూ తన పగ తీర్చుకోగలుగుతున్నారు. కానీ పాపం బొత్సకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.

 

ఇక వట్టి వసంత కుమార్ తనకి వట్టి పనికిరాని పర్యాటక శాఖను కట్టబెట్టారని మొదటినుండే అలిగిఉన్నారు. పైగా నిన్నగాక మొన్నరాజకీయాలలోకి, ఆ తరువాత పార్టీలోకి వచ్చిన చిరంజీవి మళ్ళీ ఇప్పుడు పార్టీలో కూడా మెగా స్టార్ అయిపోవడం, అది కూడా తనకే బాస్ అవడం జీర్ణించుకోవడం అంత వీజీ కాదని వట్టి మాట. ఇక గ్యాంగ్ లీడర్ చిరంజీవి ముఖ్యమంత్రిపై కోపానికి సవాలక్ష కారణాలున్నాయి.

 

ఈవిధంగా మొత్తం “కిరణ్ బాధిత సంఘం’ (కి.భా.సం.) సభ్యులందరూ మొన్న ఆర్ధిక మంత్రి ఆనం వారి విందులో పాల్గొని సోనియమ్మకు వీరవిధేయులుగా తమను తాము ప్రకటించుకొని ఎవరికి వారు ‘వీరత్రాళ్ళు’ వేసేసుకొన్నారు. ముఖ్యమంత్రి మంచోడే.. కానీ అంటూ ఆయన చేస్తున్న పనేమీ బాలేదని సూత్రీకరించారు. హైకమండ్ మాట అంటే శిలాశాసనమే, దానిని ఎవరూ దిక్కరించరాదు అని చెప్పి, అలా దిక్కరించిన ముఖ్యమంత్రిని ‘రిప్లేస్’ చేసేందుకు తామందరమూ సిద్దంగా ఉన్నామని అధిష్టానానికి కాకి (బొత్స) ద్వారా కబురంపారు.

 

అదేవిధంగా సోనియమ్మకి తాము ఎంత వీర విధేయత ప్రకటించినప్పటికీ, ఆమె తమని గేటు లోపలకి కూడా రానీయదని తెలిసున్నకి.భా.సం. సభ్యులు, ఆమె ఇంటిలో ప్రవేశానికి ‘పర్మనెంట్ పర్మిషన్ కార్డ్ హోల్డర్’ అయిన తమ గ్యాంగ్ లీడర్ చిరంజీవిని వెంటనే పంపించి అంటోనీ కమిటీని రాష్ట్ర పర్యటనకి పంపాల్సిందిగా సోనియమ్మను ప్రార్దించబోతున్నారు. తద్వారా కిరణ్ కొట్టేస్తున్న సమైక్యాంధ్ర క్రెడిట్ లోంచి తమ వాటా తాము క్లెయిం చేసుకోవచ్చని వారి ఆలోచన.

 

అదే సమయంలో అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ద్వారా రాష్ట్ర విభజనకు కిరణ్ ఒప్పుకోకపోతే మేమున్నామని స్పష్టం చేసారు. తద్వారా సీమంద్రాలో వారి రాజకీయ భవిష్యత్త్ మాటెలా ఉన్నపటికీ, సాటి తెలంగాణా నేతలందరి చేత ముందుగా దండలు వేయించుకొనే గొప్ప సదావకాశం పొందగలుగుతున్నారు.

 

“జబ్ మియ్యా బీబీ రాజీ హై తో క్యా కారేగా ఖాజీ” (మొగుడు పెళ్ళాలు రాజి పడితే ఇక ఖాజీ మాత్రం ఏమి చేయగలడు?) అనే సూత్రం ప్రకారం సీమంద్రా, తెలంగాణా మంత్రులు ఈవిధంగా ఒకరికొకరు సహకరించుకొంటే, ఇక హైకమాండ్ మాత్రం ఎందుకు కాదంటుంది? కాగల కార్యం గందర్వులే తీర్చారంటే ఇదేనేమో అని తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచి, రెండు నెలలుగా వెనక్కి తగ్గమని చెపుతున్నపటికీ, ముందుకు కూడా కదలలేని స్థితిలో ఉన్నతమను ముందుండి ముందుకు నడిపించేందుకు వస్తున్న సీమంధ్ర నేతలకు మరో వీర త్రాడు వేయడం ఖాయం.

 

ఇంత పెద్ద సమస్యని తన హస్తానికి బురద అంటకుండా చక్కబెట్టినందుకు గాను కి.భా.సం.లో ఎవరికో ఒకరికి “ఆరు నెలల ముఖ్యమంత్రి పదవి”ని బహుమానంగా ప్రకటించవచ్చును. మళ్ళీ జీవితంలో ఇటువంటి అవకాశం రాదని భావించేవారెవరయినా అందుకు అర్హులే.

 

చివరాకరిగా ఓ ధర్మ సందేహం మిగిలిపోయింది. ఈ ‘కి.భా.సం.’ ఐడియా నిజంగా వారి బాధ నుండి పుట్టుకొంచిందా లేక అందులో కూడా హైకమాండ్ హస్తం ఉందా అని?