TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మసకబారుతున్న యువ కిరణాలు

Published on: Tue Mar 20, 2012 2:21PM

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీవ్ గాంధీ పేరును అడ్డుపెట్టుకుని మధ్యలో తన పేరును కూడా ఇరికించుకుని అట్టహాసంగా ప్రారంభించిన రాజీవ్ యువకిరణాలు పథకం ఘోరంగా విఫలమయింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువకులను గుర్తించి వారికి శిక్షణ ఇప్పించి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ పూర్తిగా నెరవేరడం లేదు. కానీ ఈ పథకం పబ్లిసిటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ. 20 కోట్లు ఖర్చు పెట్టింది. నిరుద్యోగులకు ఉపాధి మాత్రం లభించడం లేదు కానీ వీరికి తూతూ మంత్రంగా శిక్షణ ఇస్తున్న కొన్ని సంస్థలు మాత్రం లక్షలాది రూపాయలుఆర్జిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నెలాఖరునాటికి సుమారు మూడు లక్షలమందికి శిక్షణ ఇప్పించినట్లుగా రికార్డుల్లో పేర్కొంటున్నారు.

 

అయితే ఈ మూడు లక్షల్లో 30 వేల మందికి కూడా ఉపాధి అవకాశాలను కల్పించలేకపోయారు. హడావిడిగా నిరుద్యోగులను గుర్తించి తూతూ మంత్రంగా వారికి శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ అరకొర శిక్షణతో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. కొన్ని ప్రైవేట్ సంస్థలు వీరికి ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ వీరి పనితీరు ఘోరంగా ఉండడంతో వెంటనే ఉద్యోగం నుంచి తీసివేస్తున్నాయి. మరి కొంతమంది శిక్షణా సంస్థలు చూపిస్తున్న ఉద్యోగాలు నచ్చక అక్కడ చేరటం లేదు. పరిగణనలోకి తీసుకుంటే రాజీవ్ యువకిరణాల లక్ష్యంలో 10 శాతం కూడా సాధించలేకపోయినట్లు తెలుస్తుంది. శిక్షణ సంస్థలకు ప్రభుత్వ నిధులను దోచిపెట్టేందుకే రాజీవ్ యువకిరణాలను ప్రవేశపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.