ముఖ్యమంత్రి శ్రీధర్ బాబుని ప్రమోట్ చేస్తున్నారా?

 

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతలందరి వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే ఉంది. సీమాంధ్ర యంపీలు, కేంద్రమంత్రులు రాష్ట్ర విభజన గురించి చాలా ముందుగానే తెలిసి ఉన్నా ఆవిషయాన్ని చివరివరకు దాచిపెట్టి తరువాత ఆడిన నాటకాలు చూస్తూనే ఉన్నాము. ఇక తను ముఖ్యమంత్రి పదవిలో ఉండగా రాష్ట్ర విభజన జరిగే పరసక్తే లేదని బల్లగుద్ది మరీ చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా బిల్లు శాసనసభకు చేరుకోనేవరకు అందరినీ కట్టడిచేసి, విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు తెలంగాణా వారికంటే ఎక్కువ సహకారం అందించారు. బిల్లువచ్చాక దాని అంతు తేలుస్తామని ప్రగల్భాలు పలికిన ఆయన అది ప్రవేశపెడుతున్నపుడు అసలు సభకే హాజరు కాలేదు. ఆ తరువాత కూడా దాని గురించి గట్టిగా మాట్లాడింది లేదు.

 

ఇప్పడు శాసనసభ సమావేశాలు మొదలయ్యే ముందు శ్రీధర్ బాబు మంత్రి పదవి వెనక్కి తీసుకొని మళ్ళీ మరో కొత్త నాటకానికి తెర లేపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జరుగుతున్న రగడ, ఆయన రాజీనామా డ్రామాతో వెల్లువెత్తుతున్నసానుభూతి మంత్రి శ్రీధర్ బాబుని ఒకే ఒక్క రోజులో తెలంగాణా హీరోగా ఎదిగిపోయారు. ఆయన శాఖ మార్పిడితో తెలంగాణా బిల్లుకి వచ్చేనష్టం ఏమీ లేదని అందరికీ తెలిసినప్పటికీ, అందరూ కూడా ఏదో ఉపద్రవం ముంచుకు వస్తున్నట్లు దాని గురించే మాట్లాడుకొంటున్నారు. ఇది చివరికి ఎంతవరకు వెళ్లిందంటే ఏకంగా తెలంగాణా బంద్ కి పిలుపు ఇచ్చేంత. ఇంత చిన్న విషయానికి ఇంత హంగామా ఎందుకు జరుగుతోందనే అనుమానాలు కూడా కలగడం సహజం.

 

ఇంతకాలంగా మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సంగతి అందరికీ తెలుసు. ఒకరు తెలంగాణా కోసం, మరొకరు సమైక్యాంధ్ర కోసం వాదిస్తున్నపటికీ, అది వారి స్నేహానికి ఎన్నడూ కూడా పెద్ద అడ్డంకిగా మారలేదు. తెలంగాణా ఏర్పాటు అనివార్యమని ముఖ్యమంత్రికి తెలియకపోలేదు. అదేవిధంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొట్ట మొదటి ముఖ్యమంత్రి కావాలనుకొనే వారిలో శ్రీధర్ బాబు కూడా ఒకరని కూడా తెలియకపోలేదు.

 

అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేఖించే ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, ఇంకా గీతారెడ్డి, డీ.శ్రీనివాస్ వంటి హేమాహేమీలు అనేకమంది ఈ రేసులో ఉన్నారు. వారందరితో పోలిస్తే శ్రీధర్ బాబు ఈ రేసులో కొంచెం వెనకబడి ఉన్నారనేది సుస్పష్టం. మరి తనకు ఆప్తుడయిన శ్రీధర్ బాబుని ఈ రేసులో అందరి కంటే ముందుకు తీసుకు వెళ్ళాలంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒకటి చేయక తప్పదు. ఆయనేమి చేసారో, దానివల్ల శ్రీధర్ బాబు స్కోర్ ఒక్కసారిగా ఎలా పెరిగిపోయిందో వేరే చెప్పనవసరం లేదు.

 

రాష్ట్రం విడిపోయిన తరువాత తనను తీవ్రంగా వ్యతిరేఖించే దామోదర, జానారెడ్డి, జైపాల్ రెడ్డివంటి వారికంటే, తనకు అత్యంత ఆప్తుడయిన శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కాగలిగితే దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డికి లాభమే తప్ప నష్టమేమి ఉండదు. బహుశః అందుకే ఈ మిత్రభేధమనే డ్రామా మొదలయినట్లు భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి తను ఏవిధంగా సమైక్య చాంపియన్ గా ఎదిగారో, అదేవిధంగా అదును చూసి శ్రీధర్ బాబుకి మంత్రి పదవి తొలగించి అతనిని కూడా రాత్రికి రాత్రి తెలంగాణాలో హీరోగా మార్చేసారు.

 

మరి శ్రీధర్ బాబు ఈ వేడిని ఎంతకాలం కాపాడుకొని తెలంగాణాలో తన రేటింగ్ పెంచుకోగలరనేది ఆయన శక్తియుక్తుల మీద ఆధారపడి ఉంటుంది. తాటిచెట్టు ఎక్కేందుకు ఎవరయినా కొంత వరకే సాయం చేయగలరు. ఆ తరువాత స్వయంగా ఎక్కవలసి ఉంటుంది. ఇది కూడా అంతే మరి.