శ్రీధర్ బాబుకి జలక్ దేనికో?

 

ఇంతకాలం గట్టిగా సమైక్యవాదం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభకు తెలంగాణా బిల్లురాగానే చాలా వీరోచితంగా పోరాడి బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేస్తారని ఆశిస్తే, ఆయన చప్పగా చల్లారిపోవడం చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నిన్నఆ పదవి నుండి తప్పించి, ఆ శాఖను తన అనుచరుడు మంత్రి ఎస్‌.శైలజానాద్‌కు అదనపు బాధ్యతగా అప్పగించారు. సరిగ్గా మరో రెండు రోజుల్లో శాసనసభ మళ్ళీ సమావేశాలు మొదలవనున్న ఈ సమయంలో తెలంగాణా బిల్లును సభలో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్న శ్రీధర్‌బాబును ఆ పదవి నుండి తప్పించడం ద్వారా రాజకీయాలలో మళ్ళీ ఒక్కసారిగా వేడి పుట్టించారు.

 

అధిష్టానం ఆమోదముద్ర లేనిదే రాష్ట్ర మంత్రుల నియామకాలు, వారి శాఖల మార్పులు చేయ సాహసించని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండానే కీలకమయిన ఈ సమయంలో ఒక తెలంగాణా మంత్రిని శాఖ నుండి తప్పించడం మరోమారు అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంగానే భావించవచ్చును. దానివల్ల సీమాంధ్ర ప్రజలో దృష్టిలో ఆయన మళ్ళీ సమైక్యహీరోగా మరికొన్ని మార్కులు సంపాదించుకోవచ్చును.

 

అంతే గాక ఈ నిర్ణయం తెలంగాణా నేతలందరికీ ఆగ్రహం తెప్పించడం సహజమే గనుక రేపు వారందరూ సభలో ఆయనపై మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్నపుడు, ముఖ్యమంత్రి పద్మవ్యూహంలో అభిమన్యుడులాగ వారినందరినీ వీరోచితంగా ఎదుర్కొని పోరాడడం ద్వారా ఈ మధ్య కాలంలో మసకబారిన తన సమైక్య చాంపియన్ ట్రోఫీకి మళ్ళీ కొత్త మెరుపులు ఆద్దుకొనే అవకాశం కూడా ఆయనకు కలుగుతుంది. ఇవన్నీఆయన కొత్త పార్టీకి ప్రజల సానుభూతిని, మద్దతుని సంపాదించిపెడతాయి కూడా.

 

ఇక రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న శైలజానాథ్ కు శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి ఆయన అనుచరులు ఈసారి సభలో తెలంగాణా బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. అయితే ఓటింగు కూడా అవసరం లేని బిల్లుని వారు ఎంతగట్టిగా వ్యతిరేఖించినా దానివల్ల బిల్లుపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదు. బిల్లుపై వ్యతిరేఖతకు సిద్డంపడిన తరువాతనే కేంద్రం దానిని శాసనసభకు పంపింది గనుక కాంగ్రెస్ అధిష్టానానికి ఇదేమి ఆందోళన కలిగించే విషయం కాదనే చెప్పవచ్చును. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు బిల్లుపై చర్చకు సిద్దమయినప్పటికీ, సభలో సమైక్యతీర్మానం చేసేవరకు సభను నడవనీయమని జగన్మోహన్ రెడ్డి చెపుతునందున సభలో చర్చజరగడం అనుమానాస్పదమే. కానీ, ముఖ్యమంత్రికి సభలో చర్చ జరిపే ఉద్దేశ్యం ఉంటే, వైకాపా సభ్యులతో సహా సభలో ఆందోళన చేస్తున్నవారిని సస్పెండ్ చేయవలసి ఉంటుంది. వైకాపా, తెదేపా సీమాంధ్ర సభ్యులు కూడా బహుశః అదే కోరుకొంటునట్లయితే, వారు సభ నుండి బహిష్కరింపబడగానే, మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీలపై రంకెలు వేసి తృప్తి పడవచ్చును.

 

ఈసారి సమావేశాలలో జరిగిన పరిణామాలను బట్టి, మళ్ళీ శాసనసభ జనవరి16న చివరిసారిగా సమావేశమయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు అంతిమ పోరాటం చేసి, ముందు నుండి అనుకొన్న విధంగానే బిల్లును శాసనసభ గుమ్మం వరకు సాగనంపి, రాజీనామాలు చేసి, కొత్త జెండా పట్టుకొని ప్రజల ముందు రావచ్చును.