ఉత్తమ్ కంచుకోటలో ఈసారి గులాబీ జెండా ఎగురుతుందా? కేసీఆర్ వ్యూహం అదేనా?

 

పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కంచుకోట హుజుర్ నగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎలాగైనా ఉత్తమ్ కు చెక్ పెట్టాలని గులాబీ బాస్ తీవ్రంగా ప్రయత్నించినా, టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. 2009నుంచి హూజుర్ నగర్ నుంచి చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. 2009లో ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డి... టీఆర్ఎస్ నుంచి పోటీకి దిగి ఓటమిపాలయ్యారు. ఇక 2014లో అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇచ్చినా, ఆమె కూడా ఉత్తమ్ పై గెలవలేకపోయింది. దాంతో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని బరిలోకి దింపారు. అయితే, సైదిరెడ్డి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, చివరికి ఉత్తమ్ చేతిలో పరాజయం పాలవ్వక తప్పలేదు. వరుసగా మూడోసారి టీఆర్ఎస్ కు భంగపాటు కలిగినా, సైదిరెడ్డి... గట్టిపోటీనివ్వడంతో... మళ్లీ అతనికే టికెట్ ఇచ్చి, బరిలోకి దింపింది గులాబీ పార్టీ. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఆలస్యంగా అభ్యర్ధిని ప్రకటించడంతోనే నష్టం జరిగిందని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం.... ఈసారి ముందుజాగ్రత్తపడింది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధిని ప్రకటించి కదనరంగంలోకి దింపింది.

అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ మొత్తం దాదాపు క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ.... రెండు నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నల్గొండ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... నల్గొండ బరిలో నిలిచి సూపర్ విక్టరీ కొట్టారు. అయితే, నల్గొండ ఎంపీ సీటును కోల్పోయి పరాభవంలో ఉన్న టీఆర్ఎస్.... ఎలాగైనాసరే హుజుర్ నగర్ ఉపఎన్నికలో గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. అందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను... గ్రామ-మండల ఇన్ ఛార్జులుగా నియమించి విజయానికి వ్యూహం పన్నింది.

అయితే, ఈసారి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి బరిలో దిగుతుండగా, బీజేపీ నుంచి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీ కూడా తన అభ్యర్ధిని పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఎంతమంది పోటీలో ఉన్నా, ఈసారి మాత్రం హుజూర్ నగర్ లో ఎగిరేది గులాబీ జెండానే అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. దాంతో, హుజూర్ నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది.