పార్టీపై కేసీఆర్ పట్టు తప్పుతోందా? అసహనం అందుకేనా? 

తెలంగాణలో తెరాసకు తిరుగులేదు.. ఇది నిన్నటి మాట. తెరాస’లో కేసీఆర్’కు ఎదురు లేదు ఇది కూడా అంతే.. పార్టీ అంతర్గత వ్యవహారాలు, కేసీఆర్ అంతరంగం అంతో ఇంతో తెలిసిన వారిని ఎవరిని కదిల్చినా ఇదే మాట అంటున్నారు. నిజానికి ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండానే, వాస్తవ పరిస్థితి ఏమిటో ప్రతి ఒక్కరికీ కారులో కల్లోలం బుల్లి తెరపై బొమ్మలా అందరికీ కనిపిస్తూనే వుంది. అందుకే  రాజకీయ విశ్లేషకులు మొదలు సామాన్య ప్రజల వరకు అందరిలో తెరాసలో ఏమి జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో  ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’, ‘అంతా ఏమంత బాగోలేదు’ అన్న నిజం అందరికి అర్థమైపోయింది. ఇప్పుడదో బహిరంగ రహస్యం. దాచేస్తే దాగని సత్యంగా అందిరి నోళ్ళలో నలుగుతోంది.    

ఓ వంక కుటుంబంలో అంతర్గత విబేధాలు, వారసత్వం కుమ్ములాటలు, మరో వంక పార్టీలో,ప్రభుత్వంలో లుకలుకలు పార్టీ మీద కేసీఆర్ పట్టు సడలుతున్న వైనాన్ని స్పష్టం చేస్తోందని రాజకీయ వర్గాల్లో, మీడియాలో వార్తలు  గుప్పుమంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే, అంతర్గత కుమ్ములాటలు బహిరంగ హెచ్చరికల స్థాయికి చేరాయి. అది కూడా వారో వీరో కాదు, స్వయంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్’ పార్టీ వేదిక నుంచి పార్టీ నాయకులను తాట తీస్తా, తోలు వలుస్తా అని హెచ్చరించడం గమనిస్తే ఆయనలో అసహనం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా  రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలను స్థాయి మరిచి దుర్భాషలు ఆడడమే కాకుండా, తమకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చినగిరిజన మహిళలను ‘కుక్కలు’ అంటూ దూషించడం ఆయనలో పెరుగతున్న అసహనానికి నిదర్శనంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మాత్రమే కాదు కేటీఆర్ కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. అదే విధంగా పార్టీలో మొదటినుంచి ఉన్న కీలక నేతలు చాపకింద నీరుల అసమ్మతిని రాజేసే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే ముఖ్య నేతల మధ్య కూడా కీలక నిర్ణయాల  విషయంలో విబేధాలు తీవ్ర స్థాయికి చేరిన సంకేతాలు స్పష్టమవుతున్నాయి.   

అయితే  ముఖ్యమంత్రిలో ప్రతి ముఖ్య నేతలో ఇంతటి అసహనానికి కారణం ఏమిటని అలోచిస్తే, ప్రధానంగా ఇంటి పోరు కారణంగానే కేసీఆర్’లో రోజురోజుకు అసహనం పెరిగిపోతోందని తెలుస్తోంది. దానికి తోడు రెండుమూడు నెలల క్రితం దుబ్భాక అసెంబ్లీ స్థానికి జరిగిన ఉపన్నికలో, ఆ తర్వాత హైదరాబాద్ నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం ఇప్పటికీ ఆయనకు మింగుడు పడడంలేదని రాజకీయ వర్గాల్లో వినపిస్తోంది. అలాగే త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ గెలుపు విషయంలోనూ,ఇంటల్జెన్సీ నివేదికలు హెచ్చరికలు చేస్తున్నాయని చెబుతున్నారు. అందుకే మొన్నటి సాగర్ సభలో ముఖ్యమంత్రి గిరిజన మహిళలను ‘కుక్కలు’ అనే వరకు వెళ్ళారని, పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు కాలు జారితే తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే వెనక్కి తీసుకోలేమని, ముఖ్యంగా రాజకీయాల్లో నోరు జారితే అందుకు మూల్యం చేల్లిచుకోవలసి వస్తుందని, పార్టీ స్థానిక నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.

ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు తండాలో తమ భూములు  కబ్జాకు గురయ్యాయంటూ గత కొంతకాలంగా గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గిరిజన మహిళలను ‘కుక్కలు’లతో పోలుస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లేనని స్థానిక తెరాస నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ గిరిజనుల పక్షాన ఆందోళన చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇటీవల పార్టీలో చేరిన విజయ శాంతి ఇతర నాయకులు గుర్రంపోడు తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజీపీ, తెరాస కార్యకర్తల మధ్య తోపులాటలు. పోలీసుల లాఠీ ఛార్జ్ వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారం పది  రోజులుగా  ఉద్రిక్త వాతావరణ నెలకొని ఉంది. ఆ నేపధ్యంలో ముఖ్యమంత్రి  జిల్లా పర్యటన  సందర్భంగా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం, గృహ నిర్భందంలో ఉంచడంతో  పరిస్థితి మరింత వేడెక్కింది. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రేపటి నాగార్జున సాగర ఎన్నికల్లో పార్టీకి మేలు కంటే కీడే ఎక్కవ చేస్తాయని ఇటు పార్టీ నాయకులు, అటు రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. 

ఇటీవల పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ఎస్సీ, ఎస్టీలను చులకన చేస్తూ వారికీ అక్షరం ముక్క రాదని అవహేళన చేయడం రచ్చ రచ్చైంది. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పి,చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. త్వరలో ఉప ఎన్నికల జరగనున్న నాగార్జున సాగర్ నియోజక వర్గంలో దళిత, గిరిజన, ఎస్సీ,ఎస్టీ ఓట్లు కీలకం కానున్న నేపధ్యంలో ఆయా కులాలను కించపరిచే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా, అందుకు మూల్యం చెల్లించక తప్పదని, అందుకు అధికార పార్టీ, ముఖ్యమంత్రి మినహాయింపు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

నాగార్జున సాగర్, హాలియా బహిరంగ సభలో ముఖ్యమంత్రి కురిపించిన వరాల జల్లుపై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు.ఈ వరాలు ప్రజలపై అంతగా ప్రభావం చూపదని, లోపాయికారి చర్చల్లో అధికార పార్టీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి ఇదే విధమైన వాగ్దానాలు చేసారని, అయితే, అందులో ఏ ఒక్క వాగ్దానం కూడా అమలుకాలేదని  విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో వంక సోషల్ మీడియాలో అప్పటి, ఇప్పటి క్లిప్పింగులతో ప్రచారం అవుతున్న వార్తలు వాగ్దానాల డొల్లతనాన్ని చూపుతోంది. దీంతో అప్పటి వాగ్దానాలను  మరిచి పోయినట్లుగానే ఈ వాగ్దానాలను మరిచి పోతారని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు. అలాగే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నాగార్జున సాగర్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే  జానారెడ్డి అయితే  ఎన్నికల సమయంలో ఉత్తుత్తి వాగ్దానాలు చేయడం తెరాస పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్’కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. అయితే అన్నిసందర్భాలలో అందరినీ మోసం చేయడం ఎవరికీ సాధ్యం కాదని కూడా జానా పేర్కొన్నారు... అది నిజం కూడా..