Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీల లిస్ట్ ఇదే..!
posted on: Nov 9, 2021 4:34PM
ఏపీ శాసనమండలిలో ప్రస్తుతం 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు మూడు కాగా... స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పదకొండు. ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్లు మొదలు కాగా.. స్థానిక సంస్థల కోటాలోని 11 స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పెద్దల సభకు కొత్తగా ఎంపిక అయ్యేది ఎవరు.. ఎవరికి అవకాశం దక్కనుంది అనే చర్చ సాగుతోంది.
అసెంబ్లీలో ఉన్న బలాబలాల ఆధారంగా ఎమ్మెల్యే కోటాలో మూడు సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీనే మెజార్టీ సాధించటంతో ఆ 11 స్థానాలు వైసీపీనే గెలవనుంది. దీంతో మొత్తం 14 స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారని తెలుస్తోంది. సామాజిక సమీకరణాల, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడేలా అభ్యర్థులను ఖరారు చేశారని అంటున్నారు, గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన వారికి ఈ సారి ఖాయంగా అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీలతో కొందరికి జగన్ కేబినెట్ లో స్థానం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.
గుంటూరు జిల్లా చిలకూలురు పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఈసారి మండలి బెర్త్ ఖాయమని అంటున్నారు. వైసీపీలో మొదటి నుంచి యాక్టివ్ గా ఉన్న మర్రికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు జగన్. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం మర్రిని మంత్రిని చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కాని రెండున్నర ఏండ్లు అవుతున్నా మర్రికి మాత్రం న్యాయం జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి మర్రికి ఖాయమని ప్రచారం జరగడం.. చివరకు ఆయనకు షాక్ తగలడం కామన్ గా మారింది. ఈసారి మాత్రం మర్రి రాజశేఖర్ కు సీటు ఖాయమైందని అంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి మరో సీటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఖాయమని తెలుస్తోంది. ఉమ్మారెడ్డి తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.. ఆయనను ఎమ్మెల్సీగానే పంపే ఛాన్స్ కనిపిస్తోంది.
కృష్ణా జిల్లా నుంచి గన్నవరం నియోజకర్గ నేతలకే దక్కే అవకాశం ఉంది.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వంశీ.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ పోటీ చేశారు. వంశీ చేరిక తర్వాత నియోజకవర్గంలో రెండు వర్గాల ఆదిపత్య పోరు సాగుతోంది. దీంతో యార్గగడ్డను మండలికి పంపించి వంశీకి లైన్ క్లియర్ చేయాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. రెండో స్థానం బీసీలకు దక్కనుందని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు ఎమ్మెల్సీ ఖాయమని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు శాసనమండలి బెర్త్ ఖాయమైందని తెలుస్తోంది. ఆమంచి గత ఎన్నికల్లో చీరాలలో ఓడిపోయారు. తర్వాత ఆమంచిపై గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. దీంతో ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చిన జగన్.. ఆమంచిని శాసనమండలికి పంపించి కరణంకు చీరాలలో ఇబ్బంది రాకుండా చూస్తున్నారని చెబుతున్నారు. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖ నుంచి నామినేటెడ్ పదవి ఆశించిన వంశీకృష్ణ తో పాటుగా వరుదు కళ్యాణి కి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిన..తోట నరసింహం సతీమణి తోట వాణి పేరు ఖరారు అవుతుందని చెబుతున్నారు.అనంత ఉదయ భాస్కర్ తో పాటుగా ఆకుల వీర్రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ పార్టీ ఇన్ ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డికి ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు లేదా బీసీ అభ్యర్థికి ఖరారయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న భరత్ కు మండలి సీటు కన్మామ్ అయిందంటున్నారు. కుప్పంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ మంచి ఫలితాలు సాధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టడానికి భరత్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నారని అంటున్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు, హరిప్రసాద్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు.






