ముందు ఇంగ్లీష్ నేర్చుకోండి.. ఎంపీలకు చంద్రబాబు సూచన

మన తెలుగు తమ్ముళ్ల ఇంగ్లీష్ పాండిత్యం గురించి తెలిసిందే. దీనిపై అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు క్లాస్ కూడా తీసుకున్నారు. జాతీయ మీడియాలో ఇంగ్లీష్ మాట్లాడటంలో తడబడిన నేతలు.. సరిగ్గా మాట్లాడలేక చంద్రబాబును కూడా ఇరుకున పెట్టారు. దీంతో చంద్రబాబు ఇక జాతీయ మీడియాలో మాట్లాడాల్సిన బాధ్యత గల్లా జయదేవ్ కు అప్పగించారు.

ఇప్పుడు చంద్రబాబు మళ్లీ పార్టీ నేతలకు ఇంగ్లీష్ పై క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చలు జరిపిన చంద్రబాబు అనేక సూచనలు సలహాలు ఇచ్చారు. దీంతో పాటు పార్లమెంట్ లో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలని.. ఇంగ్లీష్ పై పట్టు పెంచుకోవాలని సూచించారట. అలా మాట్లాడితేనే అందరికి సమస్యలు అర్ధమవుతాయని.. అప్పుడు సమస్యల పరిష్కారానికి పట్టుబట్టవచ్చని చంద్రబాబు నేతలతో అన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో అశోక్ గజపతిరాజు, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ లు మాత్రమే అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. అయితే అశోక్ గజపతిరాజు రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అవకాశం లేదు.. ఇక జయదేవ్ కార్పోరేట్ పరంగా అయితే మాట్లాడగలరు అంతే కాని మిగిలిన విషయాల్లో కాస్త ఆలోచించాల్సిన విషయమే.. ఇక ఉన్న రామ్మోహన్ నాయుడు ఒక్కడే సమస్యలపై క్లారిటీగా వివరణ ఇవ్వగలరు. దీంతో మిగిలిన ఎంపీలు కూడా రామ్మోహన్ నాయుడులా మాట్లాడగల సామర్థ్యం పెంచుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. మరి ఈసారి మన ఎంపీలు ఏం చేస్తారో చూడాలి.