ఆవిషయం మీరే చెప్పండి.. చంద్రబాబు



ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు మరియు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా తదితరులు పాల్గొన్నారు. ముందు 45 నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ ఉండగా ఈ చర్చ మాత్రం దాదాపు గంటన్నర పైగా సాగింది. ఏపీ ప్రత్యేక హోదాపైన సమస్యలపైన సుదీర్ఘ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని.. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వదులుకోవడం వల్ల చాలా నష్టపోయామని.. అంతేకాక తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్రులపై వ్యవహరిస్తున్న తీరు తదితర విషయాలు మాట్లాడారు. మాకు ఇష్టం లేకుండా రాష్ట్ర విభజన చేశారు.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లా ఏపీ అభివృద్ధి చెందాలని దానికి కేంద్రమే సహాయం చేయాలని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని.. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో ఎందుకు ఇవ్వలేక పోతున్నారో కూడా మీరే చెప్పాలని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.



అయితే చంద్రబాబు చెప్పిన అంశాలన్నింటిని విన్న మోదీ స్పందించి ‘‘ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. ఏపీ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలకు మేం కట్టుబడి ఉన్నాం.. వాటి నుంచి వైదొలగే ఆలోచన లేదు’’ అని తేల్చి చెప్పారు.



అయితే చంద్రబాబు ఏపీ సమస్యలను మోదీకి వివరిస్తున్నప్పుడు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా ఒకటి రెండుసార్లు అడ్డుపడగా చంద్రబాబు కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. రుణ మాఫీ పేరుతో ఎక్కువ ఖర్చు చేశారని ఇప్పుడు లోటు బడ్జెట్‌ అని మా వద్దకు వస్తే ఎలా?’’ అని ప్రశ్నించగా..  రైతులకు రుణ మాఫీ మా ఎన్నికల వాగ్దానం. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా సమతుల్యం చేసుకోవాలి. ఆర్థిక సిద్ధాంతాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ రాజకీయంగా మా మనుగడ కూడా చూసుకోవాలి. రైతులు బాగా చితికిపోయినందువల్లే ఆ హామీ ఇచ్చాం. అమలు చేశాం’’ అని కాస్త ఘాటుగానే చెప్పారు.