ఈ ‘దూకుడు’ లాభించేనా?

 

గత కొంత కాలంగా ప్రతిపక్షాలతో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మొదట్లో పార్టీ వర్గాలు, మీడియా కూడా మెచ్చుకొన్నపటికీ అది చూసి మరి కొంచెం అతిగా వ్యవహరిస్తున్న ఆయన ధోరణిని ఇప్పుడు అదే పార్టీవర్గాలు, మీడియా కూడా తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టాయి.

 

ముఖ్యమంత్రిలో గణనీయమయిన ఈ మార్పు సహకార ఎన్నికల తరువాత నుండే మొదలయిందని చెప్పవచ్చును. సహకార ఎన్నికలలో పార్టీలో ఎవరూ సహకరించకపోయినప్పటికీ, ఆయన ఒంటి చేత్తో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడమే అందుకు కారణం అని చెప్పవచ్చును. ఆ తరువాత ప్రతిపక్షాలు తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా అవలీలగా వీగిపోవడంతో ఆయన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. కానీ, అవిశ్వాసానికి తెదేపా దూరంగా ఉనందునే తన ప్రభుత్వం నిలబడి ఉందని ఆయనకు తెలిసినప్పటికీ, తెదేపా తనపై అవిశ్వాసానికి మద్దతు ఈయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఆయన భ్రమించడమే ఆయనకు కొండంత దైర్యం ఇచ్చి ఆయన దూకుడు కొనసాగించేలా చేస్తోంది.

 

ఇప్పుడు ఆయన ప్రవర్తన చూస్తుంటే, కిరణ్ కుమార్ అసలు నైజం ఇదే అయినప్పటికీ, ఇంత కాలం పార్టీలో, ప్రభుత్వంలో పరిస్థితులు తనకు వ్యతిరేఖంగా ఉనందునే సాత్విక ముసుగు వేసుకోవలసి వచ్చిందేమోననిపిస్తుంది.

 

కొద్ది నెలల క్రితం ఇదే ముఖ్యమంత్రి రవీంద్రభారతిలో విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘ఎన్ని రోజులు పదవిలో ఉంటానో’ అంటూ వైరాగ్యం ప్రదర్శించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చే ఎన్నికల తరువాత కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగబోతునట్లు దృడంగా విశ్వసిస్తున్నట్లు కనబడుతున్నారు.

 

అయితే, క్రమంగా ఆయన దూకుడు అహంకారంగా మారుతుండటంతో ఇప్పుడు అన్ని వర్గాల నుండి విమర్శలు మూట కట్టుకొంటున్నారు. కొద్ది రోజుల క్రితం తెరాస నేత హరీష్ రావుకి దీటుగా సమాధానం చెబుతూ ‘తెలంగాణకు ఒక్క నయాపైసా కూడా విదిలించాను ఏమి చేసుకొంటారో చేసుకోండి’ అని ఆయన అనడం తెరాస నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

 

ఆ తరువాత మొన్న శాసన సభలో ‘కాగ్ నివేదిక అంటే అదేమి బైబిలో భగవద్గీతో కాదు అందులో చెప్పినవన్నీ నిజాలని నమ్మడానికి’ అంటూ కాగ్ నివేదికలను సైతం ఆయన తప్పుపట్టారు. మళ్ళీ అదే కాగ్ చేత ఆ మరునాడే అక్షింతలు వేయించుకోవలసి వచ్చింది.

 

ఒకవైపు విద్యుత్ కోతలతో నీళ్ళు అందక పంటలు ఎండిపోతుంటే, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఎకరం కూడా నీళ్ళు అందక ఎండిపోలేదని ఆయన శాసనసభలో చాల గట్టిగా వాదించడం చూసిన తరువాత మేధావులు సైతం ఆయన ధోరణిని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. అదే విధంగా విద్యుత్ బిల్లులు పెరిగితే ప్రజలు తప్పనిసరిగా ఆ భారం బరించాల్సిందే అంటూ దురుసుగా మాట్లాడి ప్రజలలో కూడా తనను తానూ చులకన చేసుకొన్నారు. అందుకు ప్రతిచర్యగా ప్రతిపక్షాలు అన్నీ ధర్నాలు నిరాహార దీక్షలు చేయడం, చివరికి వారి ఒత్తిడికి తట్టుకోలేక ఆయన విద్యుత్ బిల్లుల పెంపు విషయంలో వెనక్కి తగ్గాల్సిరావడం ఇటీవల కాలంలో ‘పెరిగిన ఆయన రేటింగ్స్’ పెరిగినంత వేగంగానూ పడిపోయేలా చేసాయి.

 

నానాటికి అడ్డు ఆపులేకుండా పెరుగుతున్న ధరలు, విద్యుత్ కోతలు, విద్యుత్ లేకపోయినా సామాన్య ప్రజలకు షాకులు ఇస్తున్న విద్యుత్ బిల్లులు వంటి అనేక ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం కాంగ్రెస్ అధిష్టానం అండదండలు చూసుకొని, రాష్ట్రంలో ప్రతిపక్షాల మద్య జరుగుతున్న తీవ్రయుద్ధాలను చూసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడు ‘తన గాలి వీస్తోందనుకొంటే’ అంతకంటే పొరపాటు ఉండదు.

 

కాంగ్రెస్ పార్టీలో ఎవరి పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండదని ఆ పార్టీ చరిత్ర తెలిసిన వారెవరయినా చెప్పగలరు. ఆయన ఎంత అకస్మాత్తుగా ముఖ్యమంత్రి అయ్యారో అంతే అకస్మాతుగా దాని నుండి దింపబడినా ఆశ్చర్యం పోనవసరం లేదు. అటువంటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇంత దురుసుగా వ్యవహరించడం అంటే తానూ కూర్చొన్న కొమ్మను తానే నరుకొంటున్నట్లు అవుతుంది. ఉన్న కొద్దిపాటి సమయంలో ‘ఫలానా కిరణ్ కుమార్ అనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఈ గొప్ప పనులు చేసారు’ అనే పేరు సంపాదించుకోగలిగితే అదే ఆయనకు శ్రీ రామరక్షగా నిలుస్తుంది తప్ప ఈ ‘దూకుడు’ మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.