మెదక్ ఎంపీ స్థానం నుంచి సీఎల్ రాజం పోటీ?

 

 

 

నమస్తే తెలంగాణ పత్రిక ఛైర్మన్ సి.ఎల్.రాజం మెదక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని టీఆర్ఎస్‌లో ఎంతోమంది ఉవ్విళ్ళూరుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ స్థానాన్ని తానే గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ స్థానంలో పోటీ చేయగల బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇది వుంటే, తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి సీఎల్ రాజం ఛైర్మన్‌గా వున్న నమస్తే తెలంగాణ పత్రిక ఎంతో సహకరించింది.


ఓ సందర్భంలో కేసీఆర్ కూడా ఈ విషయాన్ని చెబుతూ, సీఎల్ రాజంని టీఆర్ఎస్ తరఫున ఎన్నికలలో పోటీ చేయించడం గానీ, ఒకవేళ అది కుదరకపోతే రాజ్యసభకు పంపడం గానీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎంతోమందిని పక్కన పెట్టేశారు. పట్టించుకోవడమే మానేశారు. ఆ లిస్టులో సీఎల్ రాజం కూడా వున్నారు. ఆ బాధ సీఎల్ రాజంలో వుంది. అలాగే కేసీఆర్ ఖాళీ చేసిన మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున తాను పోటీ చేస్తానని సీఎల్ రాజం కోరగా కేసీఆర్ నో చెప్పినట్టు తెలుస్తోంది.


ఈ విషయంలో కేసీఆర్ తీరు సీఎల్ రాజంను బాధించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎల్ రాజం బీజేపీలో చేరారు. నరేంద్రమోడీ నాయకత్వంలో ‘జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు’ చేయాలని వుందని అన్నారు. రాజం బీజేపీలో చేరడానికి ముందే మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఒప్పందం కుదిరినట్టు సమాచారం.