హెల్త్ పాడుచేస్తున్న సిటీ లైఫ్ స్టైల్..!

 

గ్రాడ్యుయేషన్ అయిపోగానే, జీవితపు ధ్యేయాన్ని చేరుకోవడానికి మరింత పైకి ఎదిగి కుటుంబానికి ఆసరాగా నిలబడాలనే ఆశతో ఎంతో మంది యువత ప్రతీ ఏడాదీ పల్లెటూళ్ల నుంచి సిటీలకు చేరుకుంటారు. నగరాల్లో కెరీర్ పరంగా పైకెదుగుతున్నా, ఆరోగ్యంలో మాత్రం రోజురోజుకూ ప్రమాదంలో పడుతోంది యువత. సిటీ లైఫ్ స్టైల్ ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. పట్నపు జీవితమనేది పైకి అందంగా కనిపిస్తున్నా, దానితో పాటే ఎన్నో కనిపించని లాంగ్ లైఫ్ ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇవి అప్పటికప్పుడు ఏమీ చేయవు. కానీ జీవితంలో ఎక్కడో ఒకసారి తమ పడగ విప్పి ప్రభావం చూపిస్తాయి.

 

 

అన్నింటి కంటే సిటీలో మొదట చెప్పుకోవాల్సింది కాలుష్యమే. ఆ సిటీ ఈ సిటీ అని తేడా లేకుండా, ప్రతీ చోటా వాతావరణాన్ని కాలుష్యపరచడంలో నగరాలు పోటీపడుతున్నాయి. ఇంటి నుంచి బయటికొచ్చి, ఆఫీసులకో లేక కోచింగ్ సెంటర్లకో వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికొచ్చి స్నానం చేసేసరికి, ఒంటికి మసి ఎంతగా పట్టిందో అర్ధమవుతుంది. కళ్లముందే ఆరోగ్యాన్ని కాలుష్యం మెల్లమెల్లగా కబళిస్తోందని తెలిసినా కెరీర్, జీవితం అంటూ తనను తానే కట్టేసుకుని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు నగర వాసి. వాయు కాలుష్యంతో పాటు, అవసరం ఉన్నా లేకపోయినా హారన్లు మోగిస్తూ సౌండ్ చేసే సిటీలోని సెన్స్ లెస్ మనుషుల ధ్వని కాలుష్యం మరో కనబడని కాలనాగు. ఈ శబ్దాల మధ్య అలవాటు అయిపోయిన నగర జీవి చిన్న చిన్న శబ్దాలు వినే శక్తిని కోల్పోతాడనడంలో సందేహం లేదు. ఒక పాతికేళ్ల పాటు నగరాల్లో జీవించిన వ్యక్తి ఊపిరితిత్తుల్ని గమనిస్తే ఈ తేడా ఖచ్చితంగా తెలుస్తుంది.

 

 

నగరజీవనంలో మరో విపత్తు తిండి అలవాట్లు. రోడ్డు మీద ఏది పడితే అది తినడమే కాక, ఇంటికి కూడా కర్రీ పాయింట్స్ నుంచే తెచ్చుకోవడం ఆరోగ్యానికి మరో ప్రమాదకరమైన పని. ఇంట్లో వండుకునే సౌలభ్యం ఉన్నవాళ్ల ఒంటిలో కూడా కూరగాయలకు కొట్టిన రంగులు చేరిపోతున్నాయి. రోడ్డు సైడ్ దుకాణం నుంచి, బ్రాండెడ్ వెజిటబుల్ మార్కెట్స్ వరకూ, అన్నింటిలోనూ రంగులే. కృత్రిమ పదార్ధాలే. సిటీ లైఫ్ లో మనిషి సగటు ఆయుర్దాయం తగ్గిపోవడం వెనుక కనబడని పాత్ర ఈ తిండి అలవాట్లది. ఇక నూడుల్స్, ఫైడ్ రైస్ పాయింట్స్ గురించి, వాటిలో వాడే నూనె గురించి ఎంత తక్కువ చెప్పుకంటే అంత మంచిది.

 

 

తిండి లేకుండా మనిషి బతకగలడు కానీ నిద్ర లేకపోతే మాత్రం శరీరం శుష్కించిపోతుంది. కానీ ఈ వాస్తవం సిటీలైఫ్ లో ఉన్న వారికి అర్ధం కావట్లేదు. గతేడాది చేసిన ఒక సర్వే ప్రకారం, మెట్రో సిటీల్లో రాత్రి నిదురపోయే సమయం సగటు 5 గంటలుగా తేలింది. కనీసం 8 గంటలు పడుకోవాల్సిన మనిషి ఐదారు గంటలు మాత్రమే పడుకుంటే, ఇక శరీరాలు రోగాలబారిన పడకుండా ఎలా ఉంటాయి. నిద్రలేక ఎర్రబడిన కళ్లు ప్రతీ ఉదయాన్న సిటీలో సూర్యుడికి స్వాగతం చెబుతుంటాయి. ఆఫీసుల్లో ఓవర్ టైం కావచ్చు. లేక పార్టీ టైం కావచ్చు. కారణమేదైనా అక్కడ కోల్పోయేది నిద్ర కాదు. ఆరోగ్యం.

 

అభివృద్ధి కోసం, జీవితంలో పైకెదగడం కోసం సిటీకి వచ్చే మనిషి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం రోజురోజుకూ ఫలమౌతున్నాడన్నది వాస్తవం. కాదంటారా..?