TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిగరెట్లకోసం సిగపట్లు

Published on: Thu Mar 22, 2012 3:17PM

రాష్ట్రంలో మరో మినీ మాఫియా తయారైంది. సిగరెట్ కంపెనీల డీలర్ లు హఠాత్తుగా సిగరెట్ల సరఫరాను రాష్ట్రవ్యాప్తంగా తగ్గించారు. దీంతో సిగరెట్లకు కొరత ఏర్పడింది. ఫలితంగా వాటి రెట్లు అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి. బడ్జెట్లో సిగరెట్లపై పన్నులు పెంచబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రకటనల వెలువడిన వెంటనే రాష్ట్రంలో సిగరెట్ల సరఫరా బాగా తగ్గిపోయింది. సిగరెట్ కంపెనీల డీలర్లు నిలువలను దాచివేసి కృత్రిమ కొరతను సృష్టించారు. హోల్ సేల్ వ్యాపారులకు అధిక ధరలకు నామమాత్రంగా సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో సిగరెట్ల కొరత ఏర్పడింది. ధూమపాన ప్రియులు సిగరెట్లు లేక, ఒకవేళ లభ్యమైనా ధరలు మండుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

కొన్నిచోట్ల కిళ్ళీ షాపు యజమానులకు, ధూమపాన ప్రియులకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. విజయవాడలో గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజు ప్యాకెట్ ఎమ్మార్పి ధర రూ. 55 కాగా, హోల్ సేల్ వ్యాపారులే రూ. 70 వసూలు చేస్తున్నారు. రిటైల్ మార్కెట్లో రూ. 85కు విక్రయిస్తున్నారు. అంటే పెట్టేకు సుమారు రూ.30 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి మిగిలిన బ్రాండ్లకు కూడా ఏర్పడింది. గోల్డ్ ఫ్లేక్ చిన్నసైజు ప్యాకెట్ ఎమ్మార్పి ధర రూ. 40కాగా, హోల్ సేల్ లో రూ, 5కు, రిటైల్ లో రూ. 60కు విక్రయిస్తున్నారు. బర్కిలీ ప్యాకెట్ ధర హోల్ సేల్ లో రూ. 25కాగా, రిటైల్ లో రూ. 35 వరకు అమ్ముతున్నారు. ఈ బ్లాక్ మార్కెటింగ్ గాని అధిక ధరలను గాని నియంత్రించే వ్యవస్థ ఏదీ లేకపోవడంతో ధూమపాన ప్రియులు ధుమ ధుమలాడుతూ దమ్ము పీల్చే శక్తిలేక విలవిలాడుతున్నారు.