చిరంజీవి, కిరణ్ ల రాజకీయాలు

posted on: Mar 20, 2014 3:30PM

 

 

 

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి హోల్ సేల్ గా అమ్మేసుకొని కేంద్రమంత్రి పదవి పుచ్చుకొని పార్టీని కాపాడేసిన ఆయన విధేయతకు మెచ్చిన సోనియాగాంధీ ఇప్పుడు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించేసి మళ్ళీ పార్టీని కాపాడే బాధ్యతలు అప్పగించేసేసరికి ఆయన హనుమంతుడిలా పొంగిపోతూ కాంగ్రెస్ పార్టీని భుజాన్నేసుకొని ఎన్నికల సంద్రాన్ని లంఘించేందుకు సిద్దమయిపోయారు.

 

తొండ ముదిరితే ఊసరవెల్లి యినట్లు చిరంజీవి వంటి రాజకీయ అమాయక చక్రవర్తి కూడా రెండుమూడేళ్ళు కాంగ్రెస్ నేతలతో భుజాలు రాసుకుపూసుకు తిరగేసరికి అచ్చమయిన దేశముదురు కాంగ్రెస్ నేతలాగే మాట్లాడుతున్నారిప్పుడు. మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన వ్యవహారంలో తమ అధిష్టానానికి పూర్తిగా సహకరించారని, అయినప్పటికీ విభజనను ఆపుతానని చెపుతూ తమని కూడా మభ్యపెడుతూనే వచ్చారని ఆరోపించారు. ఆయనకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన చేయాలని నిర్ణయం ప్రకటించగానే రాజీనామా చేసి ఉండాల్సిందని వాదిస్తున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి చిత్తశుద్ది గురించి ప్రశ్నిస్తున్న చిరంజీవి కూడా ఆయనకు ఎంత మాత్రం తీసిపోకుండా ఏ విధంగా వ్యవహరించారో ప్రజలందరూ స్వయంగా చూసారు.


కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి వేరు కుంపటి పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతుంటే, చిరంజీవి నేటికీ తన పదవిని పదిలంగా కాపాడుకొంటూ పార్టీలోనే ఉంటూ, తన రాజకీయ ప్రత్యర్ధులను తప్పుపడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రజల ముందుకు వస్తున్నారు. కాకపోతే ఇటువంటి రాజకీయ నేతలందరూ ప్రజలు చాల తెలివయినవారని, విజ్ఞులని పొగుడుతూ వారిని బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేయడం గమనిస్తే వారికి ప్రజల విజ్ఞాత పట్ల ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...