కాంగ్రెస్ నాయకుడి పై చిరంజీవి ఫైర్

మెగాస్టార్ చిరంజీవి అనంతపురంలో ఒక కాంగ్రెస్ నాయకుడి ఇంటికి వెళ్లి అతని పైన ఫైర్ అవ్వడంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అనంతపురం నగరంలో ఉదయం నుంచి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న చిరంజీవి సాయంత్రం యువజన కాంగ్రెస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కోగటం విజయభాస్కరరెడ్డి ఇంటికి తేనీటి విందుకు వెళ్లారు. చిరంజీవితో పాటు మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ అభ్యర్థి ముర్షీదాబేగం ఉన్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయాలన్న ఉద్దేశంతో కోగటం విజయభాస్కరరెడ్డి చిరంజీవి దగ్గరకు వెళ్లి టీ, స్నాక్స్ తీసుకు రమ్మంటారా అని అడిగారు. దానికి చిరంజీవికి కోపం కట్టలు తెచ్చుకుంది. అగ్రహోదగ్రుడైన చిరంజీవి ‘‘యూజ్‌లెస్ ఫెలో.. ఇంకా టీ, స్నాక్స్ తీసుకురమ్మని అడుగుతావా, బుద్ది లేదా నీకు, వెంటనే తీసుకు రా ఫో’’ అంటూ విరుచుకుపడ్డారు. చిరంజీవి మాటలతో కోపంతో ఊగిపోయిన కోగటం విజయభాస్కరరెడ్డి ‘‘ఏయ్ బుద్ది లేదా నీకు, తల తిరుగుతోందా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా’’ అంటూ ఫైర్ అయ్యాడు. చిరంజీవి అలిగి వెళ్లిపోతుండగా పార్టీ కార్యకర్తలు, నాయకులు బుజ్జగించారు. కోగటం చేతే టీ, స్నాక్స్ ఇప్పించారు. కోగటం తెచ్చి ఇచ్చిన టీ, స్నాక్స్‌ను చిరంజీవి అయిష్టంగానే స్వీకరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu