సెలవలు సరే... మరి ఆటలో!

 

సంస్కృతి అంటే కేవలం కట్టూబొట్టూ కాదు. కట్టడాలూ కాదు. మన భాష, జీవనశైలి, పెద్దలు నేర్పిన సంస్కారం... అన్నీ సంస్కృతి కిందకే వస్తాయి. వీటిలో మన సంప్రదాయిక ఆటలు కూడా ఉన్నాయన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదేమో! బహుశా అందుకనే కావచ్చు. ఈ ఏడాది యునేస్కో ప్రపంచ వారసత్వ సంపద కింద ప్రాచీన ఆటలను కూడా పరిరక్షించుకోవాలంటూ పిలుపునిచ్చింది. ఇష్టంగా ఆడుకోవాల్సిన ఆటలను పరిరక్షించుకోవాలని పిలుపునివ్వాల్సి రావడం చాలా దురదృష్టకరం కదా!

 

1990వ దశాబ్దం తరువాత వచ్చిన ప్రపంచీకరణ ఒక్కసారిగా భారతదేశ పునాదులను కదిలించివేసింది. శరవేగంగా మారిపోతున్న జీవనశైలికి అనుగుణంగా తెలుగువాడు త్వరగానే అలవాటుపడిపోయాడు. దేశంలో ఎక్కడా లేనంత చురుగ్గా ఇక్కడి విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయికి చేరుకున్నాయి. ర్యాంకులను సాధించేవారిలో, ఉన్నత చదువులను చదివేవారిలో, అమెరికాకు రెక్కలు కట్టుకునేవారిలో తెలుగువారే ఎక్కువగా ఉండటమే దీనికి సాక్ష్యం. కానీ భౌతికంగా ఎదుగుతున్న మనం ఏం కోల్పోతున్నామో గ్రహించలేకపోయాము. ప్రభుత్వ పాఠశాలలకు విలువలేకుండా పోయింది. ఆటలన్నా, కథల పుస్తకాలన్నా కాలాన్ని వృథా చేసుకోవడం అన్న అభిప్రాయానికి తెలుగు సమాజం వచ్చేసింది. మనం బట్టీలు పట్టే యంత్రాలుగా మారేందుకు సిద్ధపడ్డామే కానీ... ఆలోచించే, స్పందించే, ప్రతిస్పందించే వ్యక్తులుగా ఎదిగేందుకు అంతగా మొగ్గు చూపలేదు. ఈ ప్రహసనంలో ఆటలకు, ఆ మాటకు వస్తే సంప్రదాయిక ఆటలకు దూరం కావడం వల్ల మనం ఏం కోల్పోతున్నామో ఒక్కసారి ఊహించేందుకు ప్రయత్నిద్దాం.

 

 

పిల్లవాడి ఎదుగుదలలో అ,ఆలు నేర్చుకోవడం ఎంత అవసరమో, ఆటలు కూడా అంతే అవసరం. కానీ దురదృష్టం ఏమిటంటే కిండర్‌గార్టెన్ బడులలో కూడా ఆటస్థలాలు కనిపించడం లేదు. ప్రతి పాఠశాలకీ కనీసం ఆటస్థలం ఉండాలనీ, వారిని ఆడించేందుకు కొన్ని ప్రత్యేకమైన తరగతులు ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.... అలాంటి వసతులు లేకుండానే వేలాది పాఠశాలలు పనిచేసుకుంటూ పోతున్నాయి. ఆటస్థలాల సంగతి దేముడెరుగు, అసలు పరిగెత్తేంతటి ప్రాంగణం కూడా లేకుండా బడులు సాగుతున్నాయి. పోనీ ఇండోర్‌ గేమ్స్‌కి అయినా ప్రాధాన్యత ఉంటుందా అంటే... వెన్ను విరిచే సిలబస్‌ మీద పాఠశాలు దృష్టి పెడుతున్నాయే కానీ, ఆటలాడమని వెన్ను తట్టి ప్రోత్సహించడం లేదు.

 

ఇది కేవలం ప్రాథమిక పాఠశాలల దుస్థితి మాత్రమే. పిల్లలు ఆరు, ఏడు తరగతులకు రాగానే చదువుని రుబ్బడం, రుద్దడం మొదలవుతోంది. పిల్లవాడిలో ఏమాత్రం ఓపిక మిగిలి ఉన్నా ఐఐటీ అనో, ప్రత్యేక ప్రాజెక్టులనో... చాకిరేవు చాకిరీ చేయిస్తారు. ఇక ఇప్పటి కాలేజీలను చూస్తే వాటి బయట ఉండే బ్యానర్ల బట్టి తప్ప అవి కాలేజీలో అపార్టుమెంట్లో అర్థం కాని పరిస్థితి. అలాంటి చోట ఆటల గురించి మాట్లాడినా వింతగా చూస్తారు. వెరసి పిల్లవాడు మానసికంగా, శారీరకంగా ఎదుగుతున్నాడా లేదా అన్నది ఎవరికీ పట్టడం లేదు. అతని మెదడు ద్వారా ఎన్ని మార్కులను సాధించగలం అన్నదే ఇప్పటి ప్రాధాన్యత. ఈ రకంగా బడిలో చితికిపోయే పిల్లవాడు ఇంటికి వచ్చిన తరువాత కాసేపు ఆడుకోవాలనుకోవడం సహజం. కానీ ఇంట్లో ఎక్కడ సుఖపడిపోతాడో అని అక్కడ కూడా అతణ్ని చదువు వెంబడిస్తూనే వస్తోంది. హోంవర్కుల పేరిట, ప్రాజెక్టుల పేరిట అతని సమయాన్ని హరించివేస్తోంది. వెరసి ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పిల్లవాడికి చదువే లోకంగా మారుతోంది.

 

మార్కుల వెంపర్లాటలో పడి అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు ఆటల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం గురించి అంతగా ఆలోచిస్తున్నట్లు లేదు. ఆట అనేది కేవలం ఒక కాలక్షేపం కాదు. అది ఒక వ్యాయామం. ఒక జీవన నైపుణ్యం. పిల్లలు ఆడుకుంటూనే చాలా విషయాలు నేర్చకుంటారు. వారిలో నాయకత్వ లక్షణాలు, ఇచ్చి పుచ్చుకునే ధోరణి, గెలుపోటములను స్వీకరించే తత్వం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, చొరవ... లాంటి సవాలక్ష సానుకూల దృక్పథాలు ఆటలతో అలవడతాయి. ఆటలు ఆడటం వల్ల కండరాలు, ఎముకలు ఎలాగూ బలపడతాయి. ఊపిరితిత్తులు, గుండె కూడా దృఢంగా మారతాయి. వెన్ను గట్టిపడుతుంది. ఇంద్రియాలు మరింత చురుగ్గా మారతాయి. ఇలా ఆట మీద దృష్టి పెట్టడం వల్ల శరీరం ఎలాగూ దృఢంగా మారుతుంది. మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది. చాలా సందర్భాలలో ఆత్మన్యూనత, క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలకు ఆటలను ఓ పరిష్కారంగా చూపుతారు వైద్యులు.

 

పిల్లలు ఈ ఆటల రంధిలో పడితే ఎక్కడ పాడయిపోతాడో అని భయపడిపోతున్న తత్వం ప్రస్తుత తరానిది. ఎవరితో కలిసి ఆడుకుంటున్నాడో, ఎలాంటి అలవాట్లు చేసుకుంటాడో, చదువు పాడైపోతుందేమో, కాలం వృథా అయిపోతుందేమో, దెబ్బలు తగుల్తాయి కదా... అంటూ సవాలక్ష అనుమానాలను పోషించుకుంటూ పిల్లలను సుకుమారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితం! జ్ఞానం పెంచాల్సిన చదువు ఇప్పటి పిల్లల్లో నైరాశ్యాన్ని నింపుతోంది. చదువు ముగిసి జీవితంలోకి అడుగుపెట్టే సమయానికి వారు మానసికంగా బలహీనంగా తయారవుతున్నారు. ఎలాంటి అలసటా ఎరుగని వారి శరీరాలలో నానా రోగాలు ఎలాగూ తిష్ట వేసుకుంటున్నాయి. చిన్నపాటి సమస్యలను కూడా బెంబేలెత్తి ఆత్మహత్యలకు పాల్పడేంత సున్నితంగా మారిపోతున్నారు.

 

కేవలం బయట నలుగురితో ఆడే ఆటల పరిస్థితే కాదు! నాలుగు గోడల మధ్యా ఆడుకునే ఆటలూ ఇప్పుడు కరువైపోయాయి. ఒకప్పుడు ఇంట్లో ఆడుకునే ఆటలు కూడా మేధస్సునీ, సంప్రదాయాన్నీ పెంపొందించేలా ఉండేవి. కాళ్లాగజ్జీ కంకాలమ్మ వంటి ఆటపాటల్లో ఆయుర్వేద విజ్ఞానం ఉంది. చదరంగంలో జీవితానికి సరిపడా చాతుర్యం ఉంది. కానీ ఇప్పటి పిల్లల చేతుల్లో వీడియో గేమ్స్‌, కళ్ల ముందు కార్టూన్‌ ఛానల్సే మెదుల్తున్నాయి. వీటి వల్ల పిల్లల అవయవాల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుందనీ, చిన్నప్పుడే వారు ఊబకాయం వంటి అనారోగ్యానికి గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. భాష, సంభాషణ, భావ వ్యక్తీకరణ అలవడేందుకు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చిన్నా చితకా ఆటలు ఆడుకోవాలని నిపుణులు చెబుతున్నా ఆ మాటలు గాల్లో కలిసిపోతున్నాయి.

 

ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు! ఈ సెలవుల సమయంలోనైనా కాస్త నీడపట్టున పిల్లలు కావల్సినన్ని ఆటలు ఆడుకునేలా పెద్దలు ప్రోత్సహించాలి. ఇంట్లోనూ వారితో కాస్త సమయాన్ని గడుపుతూ, చిన్న చిన్న ఆటలను నేర్పించాలి. భేషజాలను కాసేపు పక్కన పెట్టి పిల్లలతో కలిసి ఆడితే కలిగే సంతోషమే వేరు. అందుకే అన్నారు, ఆటలకు వయసుతో సంబంధం లేదని. ఇప్పటికైనా మన పిల్లలను ఆటల వైపు దృష్టి మళ్లిద్దాం. వీలైతే మనమూ ఆటలాడేందుకు ఓ అడుగు ముందుకేద్దాం! డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. కెరీర్‌లో వెనక్కి తగ్గితే తిరిగి కష్టపడవచ్చు. కానీ జీవితంలో సంతోషమూ, ఆరోగ్యమూ పోతే ఇక ఆ బ్రతుకుకి విలువేముంది. ఆ సంతోషం, ఆరోగ్యాల కోసమైనా ఆటల మీద దృష్టి పెడదాం బాస్‌!