ఆలోచన పరిధులు పెంచుకుందాం...


మీ జీవితాన్ని ఒక్కసారి తర్కించుకు చూసుకోండి.. మీ పట్ల, మీ చుట్టూ వున్న వ్యక్తుల పట్లా మీ నమ్మకాలూ, అభిప్రాయాలూ ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఇప్పటి ఈ నమ్మకాలకి, అభిప్రాయాలకి మీ చిన్నప్పటి నమ్మకాలకి, అభిప్రాయాలకి ఏమన్నా పోలికలు కనిపిస్తున్నాయా? అలా పోలికలు కనిపించాయి అంటే మీ ఎదుగుదల ఆగిపోయినట్టే. మన చిన్నప్పుడు చుట్టూ వున్న పరిసరాలు, పెద్దల మాటలు నుంచి బోలెడు నేర్చుకుంటాం. అప్పుడు నేర్చుకున్న వాటినే తిరుగులేని సత్యాలుగా జీవితాంతం నమ్ముతాం. ఇదే  మన చుట్టూ వున్న వారితోనూ, చివరికి  మనతో మనకి సంఘర్షణ కలగటానికి కారణం అని గట్టిగా చెబుతున్నారు పరిశోధకులు. 

           చిన్నతనపు నమ్మకాలు వ్యక్తుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయి అన్న విషయం మీద ఓ అద్యయనం నిర్వహించారు యూనివర్సిటీ అఫ్ కెనడా పరిశోధకులు. ఆ పరిశోదనలో ఎన్నో విస్మయపరిచే అంశాలు బయటపడ్డాయి.' చిన్నప్పుడు అమ్మ చెప్పింది', ' మా ఇంట్లో ఇలా చేసేవాళ్ళం.' ఇలాంటి మాటలు ఎందరో వాడటం చూసారు. ఓ విషయాన్ని ఎందుకు మీరు అలా చేస్తారు అంటే .." నాకది అలా చేయటం చిన్నప్పటి నుంచి అలవాటు." అని చెప్పిన వారు ఎందరోనట. ఇంతకీ అలా చిన్నప్పటి నుంచి నమ్మిన విషయాల పట్ల అంత ఆలోచన ఎందుకు? అంత పరిశోధన ఎందుకు అంటే, పరిశోధకులు ఏం చెబుతున్నారో తెలుసా ?

              చిన్నప్పుడు ఒక క్లాసు పాస్ అయ్యి మరో క్లాసు కి వెళ్ళాక, అంతకు ముందు క్లాసు లో నేర్చుకున్న పాఠాల కే పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటూ వచ్చాం. అంటే మన జ్ఞాన సముపార్జనలో వయసుతో పాటు ఎదుగుదల వుంది. కాని ఈ నమ్మకాలు లో  , వ్యక్తుల పట్ల, ఎదురయ్యే సమస్యల పట్ల  వున్న మన దృక్పధం లో మాత్రం ఎదుగుదల ఏ మాత్రం  లేదన్నమాట. దీని వలన ఏంటి నష్టం అంటే వారు ఏం చెబుతున్నారో తెలుసా" జీవితాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలనే విషయంలో తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు చిన్న తనం నుంచి ఎన్నో హితబోధలు చేస్తారు. ఆ క్రమం లోనే వారి ఆలోచనలకున్న పరిమితులను మనకూ నేర్పిస్తారు. వేగంగా మారిపోతున్న సమాజంలో, దశాబ్దాల క్రితం నాటి పద్దతులను నమ్ముతూ ఇప్పటికీ ఆచరిస్తూ, వాటినే సత్యాలుగా తిరిగి మన పిల్లలకు నేర్పించటం  ఎంతవరకు సమంజసం?" ఒక్కసారి ఆలోచించండ. అంటున్నారు. 

            అలా మన శక్తి సామర్ధ్యాల పట్ల, సమాజంలో అనుసరించాల్సిన విధి విధానాల పట్ల మన ఆలోచనల పరిధులు ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ వుండక పోతే కాలం తెచ్చిపెట్టే అవకాశాలను గుర్తించలేము . జీవితంలో ఉన్నతం గా ఎదిగిన వ్యక్తులు మొదట ఈ ఆటంకాన్నే అధిగమిస్తారు. విజేతలు ఎప్పుడూ గతంలో ఉండిపోరు. ఆ అనుభవాలని దృష్టి  లో పెట్టుకుని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా  ఎప్పటి కప్పుడు తమ ఆలోచనలని  ఓ మెట్టు ఎక్కిస్తూ వెళతారు. అందుకే కొందరు మాత్రమే రేపటిని ఈ రోజే దర్శించే దార్సినికులు అవుతారు. మరి మీరు నిన్నటి లోనే ఆగిపోతారా ?  రేపటికి స్వేచ్చగా స్వాగతం చెబుతారా ..ఆలోచించండి ..ఈ సారి నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు వంటి పదాలు వాడినప్పుడు ఆలోచించండి...ఇప్పుడు మనం చిన్న పిల్లలం కాదు కాబట్టి, అప్పుడు తెలిసి, తెలియని వయసులో నమ్మినదాన్నే ఇప్పటికి పరమ సత్యం గా నమ్మటం ఎంతవరకు కరెక్ట్ అని. 

-రమ