వంద రూపాయల కోసం పాప ప్రాణం తీసిన వార్డు బాయ్! నీలోఫర్ హాస్పిటల్ లో దారుణం..

posted on: Oct 31, 2021 8:46AM

సమాజంలో మానవత్వం నశించిపోతోంది. మంచి మనసున్నవాడు కనపడకుండా పోతున్నాడు. మనుషులకు డబ్బే ప్రధానంగా మారిపోతోంది. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నాడు. సొంత మనుషులను కూడా పట్టించుకోవడం లేదు. ప్రాణాలు తీయడానికి కూడా తెగబడుతున్నారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతుండగా.. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. వంద రూపాయల కోసం ఓ మూర్ఖుడు పసిపాప మరణానికి కారణమయ్యాడు. 

హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ లో ఈ దారుణం జరిగింది. వంద రూపాయల కోసం పసిపాస ప్రాణం తీశాడు వార్డు బాయ్.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పాపను నీలోఫర్ లో అడ్మిట్ చేశారు. అయితే ఆక్సిజన్ పెట్టడానికి వార్డు బాయ్ వంద రూపాయలు లంచం అడిగారు. కాని పాప తల్లిదండ్రులు ఇవ్వలేకపోయారు. దీంతో పాపకు అమర్చాల్సిన ఆక్సిజన్ సిలిండర్ ను డబ్బులు ఇచ్చిన మరో పాపకు అమర్చాడు. దీంతో ఆక్సిజన్ అందక పాప ప్రాణాలు కోల్పోయింది.  వార్డు బాయ్ వల్లే తమ పాప చనిపోయిందని పేరేంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఆక్సిజన్ సిలిండర్‌ను సకాలంలో అమర్చకపోవడంతో పాప చనిపోవడం  నీలో ఫర్ హాస్పిటల్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి తీవ్రంగా స్పందించారు. సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులను మందలించారు. దీంతో పాప చావుకు కారణమైన వార్డు బాయ్‌ను సస్పెండ్ చేశారు నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్. 

google-ad-img
    Related Sigment News
    • Loading...