మరోసారి కదనరంగంలోకి కేసీఆర్..

ఉద్యమ నాయకుడిగా వ్యూహ, ప్రతివ్యూహలతో, రాజీనామాస్త్రాలతో, దీక్షలతో ఎన్నటికి రాదు అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. మలిదశ తెలంగాణ ఉద్యమంతో రక్తపు బొట్టు చిందకుండా పోరాటాన్ని నడిపి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. అన్ని పార్టీలకు తెలంగాణ తప్ప వేరే ఎజెండా లేకుండా చేసి..ఆ హీట్‌ను ఢీల్లీకి తాకించారు కేసీఆర్. తన చిరకాల వాంఛ నెరవేరడంతో తనలోని ఉద్యమ నాయకుడికి రెస్ట్ ఇచ్చారు కేసీఆర్ .  నేడు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఉద్యమ నాయకుడి అవతారాన్ని త్యజించి రాష్ట్రానికి అధినేతగా జనరంజక పాలన అందిస్తున్నారు.

 

ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరోసారి తనలోని ఉద్యమ నాయకుడిని నిద్రలేపాలనుకుంటున్నారు . జడ్జీల ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల పట్ల సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన మొదలుకొని జడ్జీల నియామకం వరకు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా..ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని భావిస్తున్న కేసీఆర్ దీనిపై పోరాటం చేయాలని అందుకోసం స్వయంగా తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

ఉభయ రాష్ట్రాలకు న్యాయాధికారులను కేటాయిస్తూ రూపొందించిన జాబితాను వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఆదివారం ఆందోళనకు దిగింది. గన్‌పార్క్ నుంచి రాజ్‌భవన్‌కు న్యాయాధికారులు పాదయాత్రగా వెళ్లడం, కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరడాన్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ అదనపు జిల్లా జడ్జీ హోదాలో ఉన్న ఇద్దరు న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటే వేసింది. మరోకరి డిప్యుటేషన్ రద్దు చేసింది. దీనిపై తెలంగాణ భగ్గుమంది..అన్ని క్యాడర్‌లలోని న్యాయాధికారులు ఇవాళ్టీ నుంచి మూకుమ్మడిగా సెలవులు పెట్టాలని నిర్ణయించారు.

 

సిటీ కోర్టు వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తోటివారు అడ్డుకున్నారు.  అటు బదిలీపై వెళ్లనున్న తాత్కాలిక సీజేకు నిర్వహించే వీడ్కోలు కార్యక్రమానికి సైతం హాజరుకాకూడదని నిర్ణయించారు. వీరికి మద్థతుగా తెలంగాణ జ్యూడిషియల్ సిబ్బంది జూలై 1వ తేదిన సమ్మె చేపట్టాలని అందుకు ఇవాళ్టీ నుంచే పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించింది. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు, మంత్రులతో మంతనాలు జరిపారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు, తెలంగాణ న్యాయాధికారులకు, ప్రజలకు న్యాయం జరిగేందుకు ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేయాలని నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని సీఎం యోచిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తారు. చాలా రోజుల తర్వాత బయటకొస్తున్న ఈ ఉద్యమ నాయకుడు ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో..?