అప్పటి మాటలు ఏమయ్యాయి..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ దాదాపు 100 రోజులకు పైగా సీమాంధ్ర ప్రజలు రోడ్డెక్కారు. ప్రజలలో ఉద్యమ స్పూర్తిని రగిలించిన వారు ఉద్యోగులేనని చెప్పాలి. తీరా సీమాంధ్రుల మనోభావాలకు ఏమాత్రం విలువ లేకుండా హడావుడిగా రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో రాష్ట్ర రాజధానిని త్వరగా డిసైడ్ చేయండి..లేదంటే చెట్టుకిందైనా పనిచేస్తాం..హైదరాబాద్లో అవమానాలు భరించలేకపోతున్నాం. మన రాష్ట్రంలో మన పరిపాలన చేసుకుందాం అని డైలాగులు కొట్టారు సచివాలయ ఉద్యోగులు. తీరా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులంతా భాగ్యనగరానికి తలాక్ చెప్పి గుంటూరు, విజయవాడలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు.

 

మరి పరిపాలనలో అత్యంత కీలకమైన సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ వదిలిరావడానికి ఇష్టపడటం లేదు. పైగా ప్రభుత్వానికి ఏదోటి చెబుతూ స్వపరిపాలనను మరింత ఆలస్యం చేస్తున్నారు. రాజధాని ఎక్కడో తేల్చాలని ఒకసారి..తమ పిల్లలకు స్థానికత అడ్డొస్తోందని చెబితే వెంటనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కోరుకున్న చోట స్థానికత ఇవ్వడానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు. దీని తర్వాత వాళ్లకి దొరికిన సాకు బెజవాడలో అద్దెలు. గుంటూరు, విజయవాడలలో హైదరాబాద్‌ను మించిన అద్దెలున్నాయని చెప్పి తప్పించుకున్నారు. అయితే బెజవాడ, గుంటూరుల్లో అంత ఎక్కువ అద్దెలు లేవని స్వయంగా గృహ యజమానులు చెప్పారు. చంద్రబాబు అద్దెలు తగ్గించాలని స్థానికులను అభ్యర్థించడంతో వారు కూడా ముందుకు వచ్చారు. దానికి తోడు ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చడానికి వారంలో ఐదు రోజుల పనిదినాలు, హెచ్‌ఆర్ఏ పెంపు, రాజధాని ప్రాంతానికి రవాణా సౌకర్యాలు ఇలా కోరినవి, కోరనవి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

 

కాని హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పలువురు సీనియర్ అధికారులు ఏపీకి తరలివెళ్లడానికి చిన్నపిల్లల్లా మారాం చేస్తున్నారు. తీరా ప్రభుత్వం చెప్పిన జూన్ 27 వచ్చే సరికి ఉద్యోగులకు పీకల మీద కత్తిపెట్టినట్లైంది. అమరావతికి ఉద్యోగులు తరలివెళ్లకుండా స్వయంగా ఉన్నతాధికారులే మోకాలు అడ్డుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులు వెళితే తాము కూడా వెళ్లక తప్పదన్నది ఉన్నతాధికారుల బాధ. వీరికి ఉద్యోగ సంఘాల నేతలు కూడా జతకలవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.  అమరావతిలో సరైన వసతులు లేవని తరలింపును మరికొంత కాలం వాయిదా వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి చెట్టుకిందైనా పనిచేస్తాం అన్న వారికి సదుపాయాలతో పనేంటి..? అంటే అప్పుడు చెప్పిన మాటలు నీటిమీద రాతలేనన్న మాట. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ముఖ్యమంత్రితో కలిసి రావాల్సింది పోయి ఉద్యోగులు సహాయనిరాకరణ చేయడం ఎంతవరకు సమంజసం.