రాజ్యసభలో చిదంబర రహస్యం

 

 

.....సాయి లక్ష్మీ మద్దాల

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తో కేంద్రం ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం రాజ్యసభలో తేల్చి చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తేదీని తాను ఖచ్చితంగా చెప్పలేనన్నారు. తెలంగాణా అంశాన్ని తొమ్మిదేళ్ళుగా నానబెట్టిన కాంగ్రెస్ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికోసమే హడావిడిగా నిర్ణయం తీసుకుందన్న విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంలో 2009 లో తెలంగాణా పై ప్రకటనను ఉపసంహరించుకుంటూ ఆనాడు అన్ని పార్టీలు 'యు టర్న్'తీసుకున్నాయని చెప్పారు. మరి ఈనాడు మరల 'యూటర్న్'తీసుకోమని ఏ పార్టీ అయిన ఆయనకు హామీ యిచ్చిందా ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పవలసి ఉంది. ఎలాంటి కసరత్తు చేయకుండా తెలంగాణా పై ప్రకటన చేసారన్న విమర్శలకు సమాధానంగా శ్రీకృష్ణ కమిటీ వేసి చాలా కసరత్తు చేశామని చెప్పారు. కానీ శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ. దాని మీద కేంద్ర మంత్రి వర్గం లో కాని,పార్లమెంట్ లో కాని ఎటువంటి చర్చ జరగలేదు. వాస్తవానికి ఆ కమిటి చివరి అంశంగా తెలంగాణా గురించి ప్రస్తావిస్తూ అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారి సమ్మతితో విభజన చేయాలని చెప్పింది. కానీ విభజన ప్రక్రియ ఆ ప్రకారంగా జరగలేదు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో మొదటగా చెప్పిన 5 అంశాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే విషయాన్ని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పవలసి ఉంది.



ఎన్.డి.ఎ  ప్రభుత్వం గురించి  మాట్లాడుతూ ఆనాటి కేంద్ర హోం మంత్రిగా ఉన్న అద్వాని విభజన తనకు సమ్మతంగా లేదని చెప్పారని రాజ్యసభలో చిదంబరం అన్నారు. మరి నేడు బి.జె.పి సహకారంతో విభజన చెయ్యటానికి ఏ విధంగా ముందుకు వచ్చారో చిదంబరం చెప్పాలి. 2009 నాడు ప్రకటనను వెనకకు తీసుకున్నప్పటికీ నేడు మరల ప్రకటన చేయటానికి పరిస్థితులలో  మార్పు ఏమి వచ్చింది అనేది స్పష్టంగా చెప్పవలసి ఉంది. సి.డబ్ల్యు. సి  నిర్ణయం అంతిమ నిర్ణయం అని ప్రకటిస్తున్న కాంగ్రెస్ పెద్దలు 2001 లో సి.డబ్ల్యు.సి తీసుకున్న రెండవ ఎస్. ఆర్. సి నిర్ణయం ఏమైందో చెప్పాలి. రాష్ట్ర విభజన లాంటి అతి ముఖ్యమైన విషయాలు పార్లమెంట్ లో ప్రధాని ప్రకటించాలి. చిదంబరం ఎందుకు చేస్తున్నారు?అన్నిటికి మించి ఇప్పుడు కొత్తగా ఆంటోని కమిటీ అది కూడా పార్టీ కమిటీ వేశామని చెబుతున్నారు. ఏదైనా చెప్పుకునేది ఉంటె ఆ కమిటీతో చెప్పుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక పార్టీ కమిటీ ఎవరిని బుజ్జగించటానికి నేతలనా,ప్రజలనా?