TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరిలో రంగ హరి ... జోగయ్య సంగతి

Published on: Mon Apr 2, 2012 7:12AM

పార్లమెంట్ మాజీ సభ్యుడు చేగొండి హరిరామయ్య జోగయ్య ఓ విచిత్రమైన వ్యక్తిత్వం గల సీనియర్ రాజకీయ నాయకుడు. చెప్పాలనుకున్న విషయం తప్పయినప్పటికీ సంకోచించకుండా కుండబద్దలు కొట్టినట్లు అది తప్పు కాదు ఒప్పేనని చెబుతారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధినాయకత్వానికి జోరీగలా మారతారు. తనకిష్టమైనప్పుడు అధినాయకులను ఆకాశానికి ఎత్తేస్తారు. ఇష్టం లేకపొతే వారిపై బురదజల్లెస్తారు. గతంలో దాసరి నారాయణరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి తదితర హేమా హేమీలంగా జోగయ్య బురద రాజకీయాలకు బలైనవారే. చిరంజీవి ప్రజారాజ్యం పాటీ పెట్టడంలో జోగయ్య కీలకపాత్ర వహించారు. ఆ పార్టీలో నెంబర్ టూ, నెంబర్ త్రీ స్థానం జోగయ్యదే అంటూ ప్రచారం జరుగుతున్నా సందర్భంలో హఠాత్తుగా ఆయన ప్లేటు మార్చారు. చిరంజీవి అసమర్థుడని, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం శూన్యమని సర్టిఫికేట్ ఇచ్చారు.

అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పెద్ద అవినీతిపరుడుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ అవినీతిపరుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ పంచన చేరారు. భవిష్యత్తులో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్లేషించారు. జగన్ ముఖ్యమంత్రి కావడానికి తాను మద్దతు పలుకుతున్నానని అంటున్నారు. మరి గతంలో వై ఎస్ ఆర్ కు వ్యతిరేకంగా ఎందుకు ప్రకటనలు చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే తాను ఆరోపణలు చేసిన మాట నిజమేనని, కానీ 2009లో జరిగిన ఎన్నికల్లో తిరిగి వై ఎస్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారని అంటూ ఆయన తనను తాను సమర్థించుకుంటున్నారు. గతంలో చిరంజీవి కూడా ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకున్నారు కదా అని ప్రశ్నిస్తే నేను కోరుకున్న మాట నిజమేనని, అయితే ప్రజలు ఆయనను తిరస్కరించారని ఇందులో నా తప్పేమీ లేదని జోగయ్య చెబుతారు. ఇప్పుడు జగన్ కు జేజేలు కొడుతున్న జోగయ్య కొంతకాలం పోయిన తరువాత జగన్ కు ఛీ ఛీ లు కొట్టినా పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదు.