చంద్రబాబు వెర్సస్ చంద్రశేఖర్

 

జూన్2న ఆంద్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అదేరోజున కేసీఆర్, మరో వారం రోజుల తరువాత చంద్రబాబు నాయుడు తెలంగాణా, ఆంధ్రా ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలు, అవసరాలు ఉన్నాయి. రెండూ అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. అందువల్ల సహజంగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాల, వాటి ముఖ్యమంత్రుల పనితీరును పోల్చిచూడటం జరుగుతుంది.

 

 

వారిరువురిలో చంద్రబాబు నాయుడుకి అపారమయిన పరిపాలనానుభావం ఉంది. మంచి కార్యదక్షుడనే పేరు కూడా ఉంది. అందువల్ల సహజంగానే కేసీఆర్ కంటే చంద్రబాబు చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొని గత పదేళ్ళలో అసమర్ధ కాంగ్రెస్ పాలన వల్ల, ఉద్యమాల వల్ల, గాడి తప్పిన పాలనను ఆయన చక్కదిద్దుతారని రాష్ట్ర ప్రజలందరూ ఆశిస్తున్నారు. కానీ దాదాపు రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వంలో ఎటువంటి కదలికలేకపోవడంతో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలు వేలెత్తి చూపే అవకాశం కలుగుతోంది. బహుశః ప్రభుత్వ సమయమంతా వ్యవసాయ రుణాలమాఫీ కోసం నిధుల అన్వేషణకి, ఈ అంశంపై కాంగ్రెస్, వైకాపాల విమర్శలను త్రిప్పి కొట్టడానికే సరిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆర్ధిక ప్రతిబంధకాల కారణంగా రాజధాని విషయంలో కూడా అడుగుముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడటంతో చివరికి ఈ అంశంపై కూడా ప్రతిపక్ష విమర్శలు ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా ప్రభుత్వానికి ఇటువంటి సమస్యలేవీ లేకపోవడమే కాక మిగులు బడ్జెట్ కూడా ఉన్నందున చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొంటూ వాటిని అంతే చురుకుగా అమలు చేస్తోంది.


గత రెండు నెలల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండుసార్లు సమావేశమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలలో వ్యవసాయ రుణాలు, సుజల స్రవంతి, ఉద్యోగుల పదవీకాలం పెంపు, పెన్షన్ల పెంపు అనే నాలుగు ముఖ్యమయిన అంశాలపై మాత్రమే నిర్ణయం తీసుకొంటే, కేసీఆర్ నేతృత్వంలో జరిగిన రెండు సమావేశాలలో దళితులకు వ్యవసాయ భూములు కేటాయింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, కొత్త వాహనాల కొనుగోలుకు పోలీసు శాఖకు రూ.300 కోట్లు కేటాయింపు, ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ సరఫరాకు కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, కొత్తగా వివిధ బోర్డులు, కమీషన్ల ఏర్పాటు వంటి 50కి పైగా ముఖ్యమయిన నిర్ణయాలు తీసుకొని అప్పుడే వాటి అమలుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా మొదలుపెట్టేసారు.


చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్ కు పరిపాలనానుభావం లేనట్లే భావించవచ్చును. కానీ ఆయన అపార అనుభవజ్నుడిలా చకచకా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుచేసేలా ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తున్నారు. అంతేకాక అక్రమ నిర్మాణాల కూల్చివేత, ప్రభుత్వ భూముల స్వాధీనం, ఫీజు రీ-ఇంబర్స్మెంట్ వంటి నిర్ణయాలపై ఎన్ని విమర్శలు ఎదురవుతున్న చాలా దృడ చిత్తంతో వ్యవహరిస్తూన్నారనే ప్రశంసలు కూడా అందుకొంటున్నారు. కానీ రెండు నెలలు కావస్తున్నా చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా కార్యాచరణలో దిగకుండ మీనమేషాలు లెక్కిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేసీఆర్ చకచకా నిర్ణయాలు తీసుకొంటూ అందరినీ ఆకట్టుకొంటుంటే, చంద్రబాబు మాత్రం గత ప్రభుత్వాల పనితీరుపై శ్వేతపత్రాలు విడుదల చేయడానికే పరిమితమయిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ వీలయినంత త్వరగా ప్రభుత్వం రాష్ట్రంలోకి తరలివచ్చి పని మోదలుపెట్టాలని ఆశిస్తుంటే, చంద్రబాబు వారానికి రెండు రోజులు జిల్లాల పర్యటనలు చేస్తూ సరిపెడుతున్నారు.


వ్యవసాయ రుణాలమాఫీ, రాజధాని నిర్మాణం ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఆయా రంగాలలో నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి ఆ బాధ్యతలు అప్పగించి, చంద్రబాబు పూర్తిగా పాలనా వ్యవహరాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తే పరిస్థితులు క్రమంగా మెరుగుపడవచ్చును. అలాకాక ప్రభుత్వం ఇదే సందిగ్ధంలో ఇంకా కొనసాగినట్లయితే, ప్రభుత్వంపై ఒత్తిడి పెరగక మానదు, విమర్శలు ఎదుర్కోక తప్పదు.