ఆ జిల్లా టీడీపీ కార్యకర్తలకు అసలేమైంది?.. ఆశ్చర్యంలో ఉన్న చంద్రబాబు

 

రాజకీయ ప్రస్థానంలో పద్నాలుగేళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి, నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం సొంతం చేసుకున్న మన చంద్రబాబు ఇటీవల తెల్లవారుజాము వరకు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారట. వివరాళ్లోకి వెళ్తే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చంద్రబాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా సమీక్షలు అపాయింట్ మెంట్ లతో బిజీగా ఉండేవారు. కొత్త రాష్ట్రం కనుక కష్టపడాలని ధోరణిని చంద్రబాబు తన కార్యాచరణలో చూపించేవారు. అర్ధరాత్రి వరకు కూడా సమీక్షలు నిర్వహించిన సందర్భాలున్నాయి. ఈ హడావుడిలో పడి ఆయన టిడిపిని పూర్తిగా విస్మరించారని పార్టీ నేతలే చెబుతున్నారు. అప్పట్లో ఆయనను కలిసేందుకు కార్యకర్తలు వస్తే అపాయింట్ మెంట్ సులభంగా దొరికేది కాదట, చివరకు మంత్రులు కూడా గంటల తరబడి చంద్రబాబును కలవడం కోసం నిరీక్షించేవారు. ఆయన దర్శనం దొరకని వారు నిరాశతో వెనుదిరిగిన సందర్భాలు కూడా ఉండేవి. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటున్నారు. 

తాజాగా ఆయన జిల్లాల వారీగా పార్టీ సమీక్ష నిర్వహించడం ప్రారంభించారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో ఆయన సమీక్షలు నిర్వహించారు. విశాఖలో రెండ్రోజుల పాటు సమీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా మొదటి రోజు పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని మధ్యాహ్నం వరకు నిర్వహించారు. సాయంత్రం నాలుగైదు నియోజక వర్గాల సమీక్షలు చేపట్టారు. అవి పూర్తయ్యేసరికి సమయం రాత్రి పది గంటలు అయింది. ఇంకా రెండు మూడు నియోజక వర్గాల సమీక్షలు మిగిలిపోయాయి. దీంతో చంద్రబాబు రేపు ఉదయం సమీక్ష నిర్వహిద్దాం అని చెప్పినప్పటికీ కార్యకర్తలు అంగీకరించలేదు. ఎంత టైమైనా సమీక్షలు పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆయా నియోజక వర్గాల సమీక్షలు నిర్వహించారు చంద్రబాబు. పార్టీ అధినేత వైఖరి పట్ల కార్యకర్తలో వచ్చిన మార్పుకి ఇదొక నిదర్శనం అని చెప్పాలి. 

విశాఖపట్టణం టిడిపి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. విమానాశ్రయానికి చంద్రబాబు విచ్చేసినప్పుడు ఆయన ప్రయాణించిన దారి పొడవునా కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. ఈ పరిణామం చంద్రబాబుని కూడా ఉత్సహపరిచింది. సాధారణంగా చంద్రబాబే తెల్లవారుజాము వరకు సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. గతంలో అలాంటి పరిస్థితి వస్తే కార్యకర్తలు నేతలు విసుక్కునేవారు. కాని ఈ సారి రివర్స్ లో కార్యకర్తలే ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. సమీక్షలు నిర్వహించాలని పట్టుబట్టడం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చ నీయాంశంగా మారింది. ఉదయం మళ్లీ పది గంటలకే సమీక్ష నిర్వహించాల్సి ఉండటంతో రాత్రి ఆలస్యమైతే ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీ నేతలు కొందరు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయినా కార్యకర్తల మాత్రం వినిపించుకోలేదట. దీనికి తోడు ఒక నియోజక వర్గ సమీక్ష పూర్తయిన వెంటనే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు చంద్రబాబుతో సెల్ఫీల కోసం ఎగబడటంతో అనూహ్య జాప్యం జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి విశాఖ టూర్ అక్కడి కార్యకర్తల జోష్ తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్పష్టమవుతోంది.