TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. టీడీపీకి ఓట్లే ఓట్లు!!

Published on: Thu Feb 7, 2019 3:14PM

 

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. వరుసగా పథకాలు ప్రకటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల కోసం పసుపు-కుంకుమ పథకం ప్రవేశపెట్టడం.. నిరుద్యోగ భృతిని, వృద్ధాప్య పింఛన్ ని రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలకు పెంచడం వంటివి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి విజయాన్ని కట్టబెడతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అదేవిధంగా బడ్జెట్ లో వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించడం ద్వారా రైతుల మనసు గెల్చుకునే ప్రయత్నం చేశారు. రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులకు ఇప్పటికే పలు నజరానాలు ప్రకటించిన నేపథ్యంలో ఇక ఉద్యోగులను తన వైపుకు తిప్పుకునేందుకు సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఉద్యోగులకు చంద్రబాబు మధ్యంతర భృతి ప్రకటించబోతున్నారట. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి పే రివిజన్ కమిటీ వేయాలి. ఆ తర్వాత మధ్యంతర భృతి ప్రకటించాలి. ఎన్నికల కోడ్ తరుముకొస్తున్న నేపథ్యంలో ఇలా కమిటీని ఏర్పాటుచేసి.. అలా వెంటనే భృతి ప్రకటించాలని చంద్రబాబు యోచిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు సాధారణంగా పదిశాతానికి కాస్త ఎక్కువగా మధ్యంతర భృతి ఇస్తుంటారు. కానీ చంద్రబాబు ఏకంగా 15-20 శాతం మధ్యంతర భృతి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుతాయి. ఫలితంగా వారు టీడీపీకి జై కొట్టే అవకాశముందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి చంద్రబాబు ఉద్యోగులను ఎంతవరకు తనవైపు తిప్పుకుంటారో. మొత్తానికి ఎన్నికలకు ముందు వరుస పథకాలు, ప్రకటనలతో చంద్రబాబు విపక్షాలను ఇబ్బంది పెడుతున్నారనే చెప్పాలి.