కాపులపై కన్నేసిన చంద్రబాబు

posted on: May 17, 2012 4:39PM

రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటింగ్ నిట్టనిలువుగా చీలిపోతున్న నేపథ్యంలో 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం వుందని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పూర్తి విశ్వాసంతో వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ బలపడటానికి అవకాశం వున్న అన్ని చర్యలతోపాటు, తెలుగుదేశంపార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే తృతీయశ్రేణి నేతలను బయటకు పంపాలనే ఆలోచనతో వ్యవహరిస్తున్నారు. ఆ ఆలోచనలో భాగంగానే కాపులను తెలుగుదేశంపార్టీవైపు ఆకర్షించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశంపార్ట్టీ ఆవిర్భావ సమయంలో కాపు సామాజికవర్గానికి చెందిన అత్యధిక మంది తెలుగుదేశంపార్టీకి మద్దతుగా నిలిచారు.

 

 

 

అయితే తర్వాత కాలంలో విజయవాడలో నెహ్రూ, రంగాల మధ్య తలెత్తిన ఆధిపత్యపోరులో కమ్మసామాజికవర్గం నెహ్రూవైపు, కాపు సామాజికవర్గం రంగా వైపు చేరిపోయింది. కాపు సామాజికవర్గంలో బిసీలుగా పరిగణించే తూర్పు కాపులు తెలుగుదేశంపార్టీ అభిమానులుగానే వుండిపోయారు. చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ స్థాపించిన తర్వాత బిసీ సామాజికవర్గానికి చెందిన తూర్పు కాపులు కూడా తెలుగుదేశంపార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. పార్టీ పరంగా, నాయకుల పరంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పటికీ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరలేకపోతున్నారు. ఈ స్థితిలో అసహనంతో వున్న తూర్పు కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించాడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో తూర్పు కాపు వర్గానికి చెందిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...