ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత నాదే.. చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పలు విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నాం... కేంద్రం సాయం చేస్తే తప్ప నిలదొక్కుకోలేం అని అన్నారు. రాష్ట్రంలో నీటి కొరత ఉండకుండా ఉండాలంటే పోలవరం ప్రాజెక్టును తొందరగా సాధించాలని తెలిపారు. 2029 నాటికి దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే మంచి గమ్యస్థాన రాష్ట్రంగా ఏపీనీ తయారుచేస్తామని వెల్లడించారు. హుద్ హుద్ విపత్తు సమయంలో ప్రభుత్వం చేసిన చర్యలను ఐరాస ప్రశంసించిందని గుర్తు చేశారు. 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇస్తామని విభజన చట్టంలో పెట్టారు, అవన్నీ సాధించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్ లో విద్యుత్ సమస్య లేకుండా చేసే సత్తా టీడీపీ ప్రభుత్వానికే ఉందని, పింఛన్లు ఐదురెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేశారు. అడవుల్లో రాజధాని కట్టుకోవడం మంచిది కాదని, రాజధాని విషయంలో కొందరు తమకు తోచింది మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. కేంద్ర స్థానంలో ఉన్నందునే రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని ఎంపికచేశామని, రాజధాని వస్తే భూముల విలువ పెరుగుతుందని చెప్పారు. 40 వేల ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ఇస్తానని జపాన్, సింగపూర్ ముందుకొచ్చాయని తెలిపారు. కోర్ క్యాపిటల్ వద్ద 225 కి.మీ రింగ్ రోడ్డు వస్తుందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu