నేరస్థుడైన జగన్‌ను మహిళలు అన్నగా అంగీకరిస్తారా?

posted on: Feb 7, 2019 10:08AM

 

టీడీపీ నేతలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌, వైసీపీ నేతలకు సిద్ధాంతాలు, విలువలు లేవని విమర్శించారు. మైలవరం నియోజకవర్గంలో పోలీసులకు డబ్బులిస్తూ వైసీపీ నేతలు పట్టుపడ్డారన్నారు. అక్రమాల ద్వారా అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇప్పటి నుంచే డబ్బు సంచులు బయటకు తీస్తున్నారని, వైసీపీ వ్యవహారాలపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని నేతలకు సీఎం సూచించారు. 

ప్రభుత్వ పథకాలు ప్రజల్లో బాగా క్లిక్ అయ్యాయని, జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛను రూ.2 వేలు ఇస్తుంటే.. తాను రూ.3వేలు ఇస్తానంటూ జగన్ ప్రకటించారని మండిపడ్డారు. డబ్బులు, అమలుకాని హామీలు ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకిరావడం ఖాయమన్నారు.  ప్రతి వర్గాన్ని ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షం ఎన్ని ప్రకటనలు చేసినా ఇబ్బందేం ఉండదని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్ధంగా తీసుకెళ్లాలని సూచించారు. పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీనే కాకుండా.. చెక్కులు బ్యాంకుల్లో వేస్తే డబ్బులు ఇప్పించే బాధ్యతనూ నేతలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

అన్న వస్తున్నాడంటూ వైసీపీ చేస్తోన్న ప్రచారంపై కూడా టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రస్తావించారు. నేరస్థుడైన జగన్‌ను మహిళలు అన్నగా అంగీకరించరని ఆయన విమర్శించారు. నేరస్థుడ ఎలా ఉండాలో తెలుసు కానీ.. అన్నగా ఎలా ఉండాలో జగన్‌కు తెలుసా? అని విమర్శించారు. ఈనెల 11వ తేదీన దిల్లీలో ధర్మపోరాట దీక్ష పెద్ద ఎత్తున చేస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి దీనికి మద్దతు పలకాలన్నారు. 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి నిరసన తెలుపుదామన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను మోదీ భష్టుపట్టిస్తున్నారని టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...