రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేనట్లేనా..!

 

పోలవరం కాంక్రీటు పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ఇదొక చారిత్రక ఘట్టమని సీఎం స్పష్టంచేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నామన్నారు. 6వ రోజు ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలవరం రికార్డు సాధించడంలో చెమటోడ్చిన అందరికీ అభినందనలు తెలియజేశారు. అనంతరం పార్టీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, అందుకే ఏపీపై ప్రధాని మోడీ అసూయ పెంచుకున్నారని, అడుగడుగునా కక్ష సాధిస్తున్నారని సీఎం అన్నారు. ఏపీ పేరు వినబడితేనే ఆయనకు అక్కసు పెరిగిపోతోందని, రాష్ట్ర పురోగతి చూసి భరించలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హుందాతనం వదిలేసి మోడీ మాట్లాడుతున్నారని, తన కుటుంబం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ శకటం పైన కూడా మోడీ అక్కసు పెట్టుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో భాజపా కక్ష సాధింపునకు ఇది పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. శకటం ప్రదర్శనకు అనుమతి ఇవ్వక పోవడంపై లేఖ రాయాలని, కేంద్రం వివక్షతను బహిర్గతం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.