చంద్రబాబుకి డిల్లీలో ఏమి పనో

 

ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను సీబీఐ కోర్టులో ఉంది. తెలంగాణా నోట్ హోంమంత్రి షిండే వద్ద తయారుగా ఉంది. నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు డిల్లీలో కసరత్తు చేస్తోంది. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలను వెంటపెట్టుకొని నేడో రేపో డిల్లీ వెళ్లేందుకు నిశ్చయించుకొన్నారు. ఆయన ఆకస్మిక డిల్లీ పర్యటనకు ఇంతవరకు పార్టీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రాష్ట్ర విభజన సందర్భంగా సమన్యాయం చేయమని కేంద్రాన్ని డిమాండ్ చేసేందుకే వెళుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.

 

ఇక తెదేపా నేతలు వైకాపా గౌరవాధ్యక్షురాలు డిల్లీ వెళ్లి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి బెయిలు కోసం కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకొని వచ్చారని, అందువల్ల త్వరలో అతను బెయిలుపై విడుదలవడం ఖాయమని గట్టిగా చెపుతున్నారు. అందుకు ప్రతిగా ఒకప్పటి చంద్రబాబు సన్నిహిత మిత్రుడు, ప్రస్తుత వైకాపా నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా చక్రం తిప్పెందుకే హడావుడిగా డిల్లీ పరుగులు తీస్తున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు ఇంత హడావుడిగా ఇప్పుడు డిల్లీకి ఎందుకు వెళుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

 

ఇక, తెలంగాణా వాదులు వారి కోణంలో చూస్తూ ఆయన తెలంగాణాను అడ్డుకోవడానికే డిల్లీ వెళుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఆయన అటువంటి ప్రయత్నలేవయినా చేసినట్లయితే సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.

 

ఇక, నరేంద్ర మోడీకి బీజేపీ పట్టాభిషేకం చేయబోతున్నశుభ సందర్భంగా, చంద్రబాబు వేరే ఏదో మిషతో డిల్లీకి వెళ్లి అక్కడ ఆయనను పలకరించే అవకాశం కూడా ఉంది. మోడీ ఇటీవల తన హైదరాబాదు పర్యటన సందర్భంగా తెదేపాతో ఎన్నికల పొత్తులకు సంకేతాలు పంపారు. ఒకవేళ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, వైకాపా, తెరాసలు చేతులు కలిపినట్లయితే, బలమయిన ఆ కూటమిని ఎదుర్కొనేందుకు తెదేపా తప్పనిసరిగా బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉంది.

 

సాధారణ ఎన్నికలకు కేవలం మరో 7నెలలు మాత్రమే ఉన్నందున, ఒకవేళ మోడీని బీజేపీ తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించగలిగితే, చంద్రబాబు తన డిల్లీ పర్యటనలోఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయనను కలిసి బీజేపీకి సానుకూలమయిన సంకేతాలు ఇచ్చివచ్చే అవకాశం కూడా ఉంది.