ముగ్గురు యాత్రికులు మూడు గమ్యాలు

 

చంద్రబాబు, హరికృష్ణ, షర్మిల ముగ్గురు మూడు వేర్వేరు ప్రాంతాల నుండి వేర్వేరు ఆలోచనలతో, వ్యూహాలతో బస్సుయాత్రలు మొదలుపెట్టబోతున్నారు.

 

ఈరోజు చంద్రబాబు అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య ‘ఆత్మగౌరవ యాత్ర’ పేరిట గుంటూరు నుండి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. తెదేపా ఇచ్చిన లేఖ వలననే నేడు రాష్ట్ర విభజన జరుగుతోందనే కాంగ్రెస్ వైకాపాలు చేస్తున్నప్రచారం అడ్డుకొని, ఆ రెండు పార్టీలు మరియు తెరాసయే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నిఈ దుస్థితికి తెచ్చాయని ప్రజలకు వివరించేందుకు ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. కానీ, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న లగడపాటి వంటి వారికే ప్రజల మధ్య భంగపాటు ఎదురవుతున్న ఈ తరుణంలో, విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు సమైక్య రాష్ట్రం కోరుతున్న ప్రజలతో ఏవిధంగా నెగ్గుకొస్తారో చూడాల్సిందే. ఆయన రాష్ట్ర విభజనపై తన పార్టీ స్పందన, ఆశిస్తున్న పరిష్కారం గురించి ప్రజలకు వివరించి పార్టీని రక్షించుకోవాలని బయలుదేరుతున్నారు.

 

రేపటి నుండి షర్మిల చేపడుతున్న‘సమైక్య శంకారవం’ యాత్ర చంద్రబాబు స్వంత జిల్లా చిత్తూరులో తిరుపతి ప్రారంభించడం వ్యూహాత్మకమే. ఆమె సమన్యాయం లేదా సమైక్య రాష్ట్రం అనే నినాదంతో యాత్ర చేపడుతున్నారు. ఆమె ఈ విభజనకు కాంగ్రెస్ మరియు తెదేపాలే ప్రధాన కారణమని గట్టిగా ప్రజల మనస్సులో నాటి, తద్వారా కేవలం తమ పార్టీ మాత్రమే సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఖ్యాతిని పొందేందుకు ప్రయత్నిస్తారు. కాంగ్రెస్, తెదేపాలు ఓట్లు, సీట్లు రాజకీయాల కోసమే రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపిస్తున్న వైకాపా, ఆ ఓట్లు సీట్ల కోసమే ఈ యాత్ర చేపడుతోంది.

 

సీమంధ్రలో పట్టు సాధించేందుకు రాజీనామాలు, నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, డిల్లీ పర్యటనలు, బహిరంగ లేఖాస్త్రాలు ప్రయోగించిన తరువాత వైకాపా ఇప్పుడు తాజాగా బస్సు యాత్రలనే మరో సరికొత్త ఐడియాతో ప్రజల ముందుకు వస్తోంది. నిన్న మొన్నటివరకు తాము తెలంగాణకు వ్యతిరేఖం కాదని చెపుతూ వచ్చిన వైకాపా, ఇప్పుడు సీమంధ్రలో బలంగా ఉన్న తెదేపాను దెబ్బ తీయడానికి తెదేపా తెలంగాణకు అనుకూల పార్టీ, రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన పార్టీ అని ప్రచారం చేస్తూ సీమంద్రలో పైచేయి సాధించేదుకు ప్రయత్నిస్తోంది. అక్కడ తెలంగాణా ప్రజలను, తన పార్టీ నేతలను కూడా వంచించిన వైకాపా, నీతినిజాయితీలకు తానే మారుపేరన్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకొంటూ, ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది.

 

ఇక హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వం పూర్తయ్యేందుకు కేవలం మరో నాలుగయిదు నెలల కాలం మాత్రమే మిగిలి ఉన్నందున, రానున్న ఎన్నికలను, సీమంధ్రలో జోరుగా సాగుతున్న ఉద్యమాలను, చంద్రబాబుతో తన కున్నబేదాభిప్రాయలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టాలనే దురాశతో సమైక్యాంధ్ర కోసం అంటూ తన పదవికి రాజీనామా చేసి రేపటి నుండి చైతన్యయాత్ర చేపడుతున్నారు.

 

ఆయన తన యాత్ర సమైక్యాంధ్ర కోసమని చెప్పుతున్నపటికీ, తనను, తన కుమారుడు జూ.యన్టీఆర్ ని పార్టీలో పక్కన బెట్టి, చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ని తన వారసుడిగా ముందుకు తీసుకు వస్తున్నారనే అక్కసుతో, వారిని ఇబ్బందిపెట్టాలనే ఆలోచనతోనే ఈ యాత్ర చేపడుతున్నారు. హరికృష్ణ ఇన్నేళ్ళుగా ఎటువంటి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోయినప్పటికీ, కేవలం నందమూరి వంశానికి చెందిఉండటమే తన ఏకైక అర్హతగా భావిస్తూ పార్టీలో పదవులు ఆశించి భంగపడ్డారు. అందుకే ఇప్పుడు పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు.