అత్యాశకు పోయినందుకే జగన్ జైలుకు

 

చంద్రబాబు పాదయాత్ర ముగింపు దశకు చేరుకొనే సమయానికి ఆయన గ్రామీణ ప్రజలతో ఏవిధంగా అనుసంధానం అవ్వాలోఇప్పుడు బాగా నేర్చుకొన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు గ్రామీణులకు సులువుగా అర్ధం అయ్యేందుకు తన ప్రసంగాలలో పిట్టకధలను జోడిస్తూ తను చెప్పదలుచుకొన్నది వారి మనసులలో నాటుకొనేలా చెపుతున్నారు. నిన్న మండపేట వద్ద గల ఏడిద గ్రామంలో జగన్ మోహన్ రెడ్డి గురించి వివరిస్తూ ఆయన చెప్పిన చిన్నపిట్ట కధ గ్రామస్తులను బాగా ఆకట్టుకోంది. దురాశాపరుడయిన వ్యక్తి ఒకడు రాజుగారి వద్దకు వచ్చి తనకు కొంత భూమి ఇప్పించమని అడిగితే, అతని సంగతి కనిపెట్టిన రాజుగారు ఆ రోజు మొత్తం అతను ఎంత దూరం నడిస్తే అంత మేరా అతనికే ఇచ్చేస్తానని చెప్పడంతో, అత్యాశకు పోయినా ఆ వ్యక్తి ఆయాసపడుతూ రోజంతా తిరిగి తిరిగి చివరకి గుండె ఆగి చనిపోయాడు. అప్పుడు ఆ రాజుగారు తన భటులను పిలిచి అతనికి ఇప్పుడు కేవలం 6 అడుగుల స్థలం చాలు గనుక, అతనిని 6అడుగుల గోతిలో కప్పెట్టమని ఆజ్ఞాపించారు. ఈ కధ అంతా చెప్పి జగన్ కూడా ఆ వ్యక్తిలాగే అత్యాశకు పోయినందుకు ఇప్పుడు అతనికి చిన్న జైలు గదే మిగిలిందని చెప్పడంతో ప్రజలు నవ్వాపుకోలేక పోయారు.