పొత్తులొద్దు, ఒంటరిపోరే బెస్ట్: చంద్రబాబు

 

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం, రాబోయే ఎన్నికలకు 6 నెలలు ముందుగానే, పార్టీ అభ్యర్ధులను నిర్ణయిస్తామని ప్రకటించారు. మళ్ళీ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, ఆచంట నియోజక వర్గాల పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఎవరితోనూ ఎన్నికల పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని మరో సంచలన ప్రకటన చేసారు.

 

ఇంతవరకు ఇతరపార్టీలతో పెట్టుకొన్న ఎన్నికల పొత్తుల వలన పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువొచ్చిందని ఆయన అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో ఒంటరిపోరుకు పార్టీలో అందరూ సిద్దం కావాలని కోరారు. కార్యకర్తలందరూ ఇప్పటి నుండే పార్టీ తరపున తమ తమ గ్రామాలలో ప్రచారం మొదలుపెట్టి, ఎన్నికల నాటికి ప్రజలందరూ పార్టీకే ఓటు వేసేలా చూడాలని ఆయన కార్యకర్తలను కోరారు. కొంత మంది నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయినా, కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల అచంచల విశ్వాసం చూపుతూ పార్టీ కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారని ప్రశంసించారు. నేతలు వెళ్ళిపోయినా పార్టీ చెక్కు చెదరక పోవడానికి కారణం పార్టీ కార్యకర్తల అండదండలే అని ఆయన అన్నారు.

 

బహుశః గత ఎన్నికలలో తెరాసతో పెట్టుకొన్న ఎన్నికల పొత్తులు పెట్టుకొన్న తెలుగు దేశం పార్టీ గెలవకపోగా, తదనంతర కాలంలో అదే తెరాసతో చాలా ఇబ్బందులు పడింది. బహుశః చంద్రబాబు యొక్క ఈ అకాల వైరాగ్యానికి అదీ ఒక కారణం అయి ఉండవచ్చును. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికల పొత్తులు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రావడం అసంభవం అని చంద్రబాబుకి తెలిసినప్పటికీ, ఆయన ఈ రకమయిన ప్రకటనచేయ సాహసించారంటే బహుశః తన పాదయాత్రలో పల్లె పల్లెకు తిరిగిన ఆయన తన పార్టీ యదార్ధ పరిస్థితిని, బలాబలాలను పూర్తిగా అంచనా వేసుకొన్నందునే బహుశః ఆయన ఈనిర్ణయం తీసుకొని ఉండవచ్చును.

 

ఏది ఏమయినప్పటికీ, తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తులు అనివార్యం కావచ్చును. అదే విధంగా కాంగ్రెస్ పార్టీతో కటిఫ్ చేసుకొన్న మజ్లిస్ పార్టీ జగన్ పంచన గనుక జేరకపోతే, తప్పనిసరిగా తెదేపాతోనే పొత్తుల కోసం ప్రయత్నించవచ్చును. ఇక కేంద్రంలో యుపీయే కు ప్రత్యామ్నాయమయిన బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న యెన్డీయే కూటమిలో భాగస్వామి అయిన తెదేపా రాష్ట్రంలో బీజేపీతో ఎంతో కొంత సర్దుబాట్లు అనివార్యం కావచ్చును.

 

అందువల్ల పొత్తుల విషయంలో చంద్రబాబు ఇప్పుడే ఒక స్పష్టమయిన ప్రకటన చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి తన నిర్ణయం మార్చుకోక తప్పదు.