TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బస్సు యాత్రలతో పార్టీల భవిష్యత్ చక్కబడుతుందా

Published on: Thu Aug 29, 2013 10:04PM

 

చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టిన కొద్ది రోజులకే షర్మిల కూడా పాదయాత్ర మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేసారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయంతో వారిద్దరి శ్రమ బూడిదలో పోసిన పన్నీరయింది. కాంగ్రెస్ పెట్టిన ఈ అగ్నిపరీక్షలో వైకాపా తెలంగాణాను వదులుకోవలసివస్తే, తెదేపా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నపటికీ, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంధ్ర నేతలు చేస్తున్న ఉద్యమంతో పార్టీ ఆంధ్ర, తెలంగాణాల మధ్య ఊగిసలాడుతోంది.

 

పార్టీని ఈ పరిస్థితి నుండి బయటపడేయడానికి చంద్రబాబు మళ్ళీ గుంటూరు నుండి సెప్టెంబర్ 1న బస్సు యాత్ర చేసేందుకు సిద్దపడుతున్నారు. రాష్ట్ర విభజనకు తెదేపా ఇచ్చిన లేఖే కారణమని కాంగ్రెస్, వైకాపాలు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకొని, విభజనపై తన పార్టీ అనుసరించనున్నవైఖరిని ప్రజలకు తెలియజెప్పి రెండు ప్రాంతాలలో పార్టీని రక్షించుకొనేందుకు చంద్రబాబు బయలుదేరుతుంటే, అందుకు పూర్తి భిన్నమయిన ప్రణాళికతో- రెండు ప్రాంతాలకు సమన్యాయం, లేకుంటే రాష్ట్ర యధాతధంగా ఉంచమనే నినాదంతో షర్మిల వచ్చేనెల 2వ తేదీన ఇడుపులపాయ నుండి బస్సు యాత్ర చేపడుతున్నారు. పనిలోపనిగా, తెదేపా ఇచ్చిన లేఖ కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని ప్రచారం చేస్తూ, సమైక్యాంధ్ర కోసం తమ పార్టీయే ఒంటరిపోరాటం చేస్తోందని చాటి చెప్పుకొంటూ తద్వారా సీమంద్రాలో తన పార్టీని బలపరచుకొనే ప్రయత్నం కూడా ఆమె చేయవచ్చును.

 

ఇక చంద్రబాబు రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకొనేందుకు యాత్ర చేపడుతుంటే, ఆయన ప్రయత్నాలపై నీళ్ళు చల్లుతున్నట్లు హరికృష్ణ సమైక్యాంధ్ర కోరుతూ నిమ్మకూరు నుండి వచ్చేనెల 2న చైతన్య యాత్రపేరుతో బస్సు యాత్ర మొదలుపెట్టబోవడం విశేషం. ఆయన తన యాత్ర ద్వారా పార్టీకి దూరం జరుగుతున్నట్లు మీడియాలో వస్తున్నప్రచారాన్ని ఖండిస్తున్నపటికీ, ఆయన యాత్ర ద్వారా పార్టీకి తెలంగాణాలో తీవ్ర నష్టం జరుగుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. పార్టీలో సీమాంధ్రకు చెందిన నేతలు చాలా మంది సమైక్య ఉద్యమాలు చేపడుతున్నపటికీ, నందమూరి వంశానికి చెందిన హరికృష్ణ సమైక్యరాష్ట్రం కోరుతూ రాజీనామా చేయడం, అంతటితో ఆగకుండా ఇప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సమైక్యయాత్ర చేయడం, తెరాసకు బలమయిన ఆయుధం అందిస్తోంది.

 

ఒకప్పుడు తెలంగాణాలో తెదేపా ప్రభావం చూసి భయపడిన తెరాస నేతలకి, సీమంధ్రలో హరికృష్ణతో సహా తెదేపా నేతలు చేస్తున్న సమైక్య ఉద్యమాలు, తెదేపా తెలంగాణాకు వ్యతిరేఖమనే భావన వ్యాపింపజేయడానికి మంచి అవకాశం కలుగజేస్తోంది. కాంగ్రెస్, తెరాసలు రానున్న ఎన్నికలలో విలీనం లేదా పొత్తులకి సిద్దపడుతున్నతరుణంలో హరికృష్ణ చెప్పట్టబోతున్నఈ సమైక్య చైతన్యయాత్రతో తెలంగాణాలో పార్టీకి తీరని నష్టం కలగడం ఖాయం. హరికృష్ణకు ఈ విషయం తెలిసి ఉన్నపటికీ సమైక్యయాత్ర చేయబోవడం, చంద్రబాబుతో అమీ తుమీ తేల్చుకోవడానికేనని అర్ధం అవుతోంది.

 

చంద్రబాబు ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటే ఆయనకు హరికృష్ణ తన సమైక్య యాత్రతో మరో కొత్త పరీక్ష పెడుతున్నారు. చంద్రబాబు ఈ రెండు పరీక్షలని ఎదుర్కొని ఏవిధంగా నెగ్గుకొస్తారో చూడాలి.

 

చంద్రబాబు, షర్మిల మళ్ళీ శ్రమపడి బస్సు యాత్రలు చేసి తమతమ పార్టీలను చక్కబెట్టుకొని వచ్చేలోగా కాంగ్రెస్ పార్టీ గనుక మధ్యంతర ఎన్నికలకి గంటకొట్టేస్తే వారికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గెలుపు గుర్రాలను ఎంపిక పూర్తి చేసుకొని ఎన్నికలకి సిద్దంగా ఉంది. కానీ తెదేపా, వైకాపా ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిపడుతున్న ఈ సమస్యల నుండి బయటపడేందుకే తమ సమయం వెచ్చించవలసి వస్తోంది. బహుశః కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికల దగ్గర పడే వరకు ఇదే స్థితిలో కొనసాగేలా రాష్ట్ర విభజన సీరియల్ నడిపించవచ్చును.