చంద్రబాబు జీవితాన్నే మార్చేసే ఒక ఐడియా

 

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అకస్మాతుగా దేశంలో (అంటే తెలుగుదేశంలో కాదన్నమాట) పెరిగిపోతున్ననల్లధనం గురించి చింత పట్టుకొంది. నల్లదనాన్ని అరికట్టేందుకు ఆయనే ఒక మంచి ఉపాయం కూడా కనిపెట్టారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తే నల్లధనం బెడద కూడా వదిలిపోతుందని ఆయన శలవిచ్చారు. అంతే గాకుండా వచ్చే ఎన్నికలకి తమ పార్టీ మానిఫెస్టోలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలనే పాయింటు కూడా పెట్టబోతున్నట్లు తెలియజేసారు.

 

అసలు వచ్చే ఎన్నికలలోగానే ఆ నోట్లను రద్దు చేస్తే, ఎన్నికలలో ధన ప్రభావం బాగా తగ్గించవచ్చునని ఆయన అభిప్రాయ పడ్డారు. జగన్మోహన్ రెడ్డి వంటి అవినీతిపరులు కూడా బెట్టిన లక్షల కోట్ల నల్లధనాన్ని ఈ చిన్న ఐడియాతో అడ్డుకట్టవేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

 

అసలు నల్లదనం గురించి ఇంత హట్టాతుగా ఆయనకీ ఎందుకు బెంగ పట్టుకొందనే సంగతిని ఆయన తన మాటలలోనే బయటపెట్టుకొన్నారు. రాబోయే ఎన్నికలు తెదేపా, తెరాస, మరియు వైకాపాలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక, ఆ మూడు పార్టీలు ఎన్నికలలో విజయం సాదించడానికి ఎంతకయినా తెగించక తప్పదు. అంటే వచ్చే ఎన్నికలలో డబ్బు(నల్లధనం) విచ్చలవిడిగా వెదజల్లడం అనివార్యం అని స్పష్టం అవుతోంది.

 

జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల డబ్బు దోచుకొన్నాడని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు వైకాపా ‘ఆర్ధిక శక్తి’ గురించి, ఎన్నికలలో దాని ప్రభావం గురించి ఇప్పటికే ఆయనకీ ఒక అంచనా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎన్నికల సమయానికి కూడా జైల్లో ఉన్నపటికీ, ఆయన డబ్బే ఆయనను గెలిపిస్తుందని చంద్రబాబు ధృడంగా నమ్ముతున్నట్లు ఆయన మాటలని బట్టి అర్ధం అవుతోంది. అందువల్లే, వీలయితే ఎన్నికల ముందుగానే ఆ రెండు నోట్లను రద్దుచేస్తే, జగన్ మోహన్ రెడ్డిని పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చునని ఆయన ఆలోచన కావచ్చును.

 

అయితే, ఆయన ఊహిస్తున్నంత, చెపుతున్నంత తేలికగా ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోలేదనే సంగతి ఆయనకీ తెలుసు. కానీ, ఆయన పార్టీకి చెందిన నన్నపనేని రాజకుమారి చెపుతున్నట్లు చంద్రబాబు ఒక చర్చనయితే మొదలుపెట్టారు దాని సాధ్యాసాధ్యాలు గురించి ఆ చర్చలలో తేలుతుంది అన్నారు. అంటే, వైకాపా నేతలు ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు చెప్పుచేతల్లో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన ఆదేశాలను లేదా ఈ చిన్నపాటి కోరికను తీరుస్తోందని ఆమె అభిప్రాయమేమో చూడాలి మరి. ప్రభుత్వం ఆయన చెప్పిన మాట విని, ఈ ఐడియాను కనీసం ఎన్నికలకి మూడు నెలలు ముందు, మూడు నెలల తరువాత వరకు తాత్కాలికంగా అమలు చేసినా అది తప్పకుండా ఎవరిదో ఒకరి జీవితాన్నే మార్చేయవచ్చును.