చంద్రబాబు! పాదయాత్రకి ముందు తరువాత

 

చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టే ముందు, కొనసాగుతున్నపుడు, పూర్తయిన తరువాత పూర్తి విభిన్నమయిన ఆలోచనా ధోరణి కనబరిచారు. ఆయన పాదయాత్ర మొదలు పెట్టే ముందు పార్టీపై తెలంగాణా ప్రభావం పట్ల చాలా ఆందోళన చెందారు. తెలంగాణా ప్రాంతంలో పాదయాత్ర మొదలుపెట్టే సమయానికే కేంద్రం తెలంగాణపై అఖిలపక్షం వేయడంతో ఆయన తమ పార్టీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా బయట పెట్టవలసిన పరిస్థితి ఏర్పడటంతో ఆ ఆందోళన ఇంకా పెరిగింది.

 

అయితే, తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకొని, కేంద్రానికి ఆమేరకు లేఖ అందజేసిన తరువాత, సీమంద్రా ప్రాంతం నుండి దిక్కార స్వరాలూ వినిపిస్తాయని ఆందోళన చెందినప్పటికీ, ఆయన రెండు ప్రాంతాల నేతలతో ముందుగానే ఈ విషయంపై చర్చించి ఉండటంతో పార్టీలో ప్రశాంతత నెలకొంది. ఇక అదే సమయంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నందుకు తెలంగాణా ప్రాంతంలో ఆయన ఊహించిన దానికంటే మంచి సానుకూల స్పందన కనిపించడంతో, ఆయనలో మళ్ళీ మునుపటి ఉత్సాహం, ఆత్మ విశ్వాసం కనబడ్డాయి. పార్టీ అధినేతలో కనిపిస్తున్న ఆ మార్పుకి పార్టీ శ్రేణులు కూడా అంతే సానుకూలంగా స్పందించాయి. నిజం చెప్పాలంటే, ఆయన పాదయాత్ర ఆంధ్రా ప్రాంతంలో కంటే తెలంగాణాలోనే ప్రోత్సాహకరంగా ఉందని చెప్పవచ్చును.

 

పార్టీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన ఆయనకు, అక్కడ స్థానిక నేతలయిన కేశినేని, వల్లభనేని తదితర నేతల మద్య గొడవలు ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చాయి. ఆయన తాత్కాలికంగా సమస్యని సర్దుబాటు చేసినప్పటికీ అవి నివురుగప్పిన నిప్పులా మిగిలే ఉన్నాయి. ఆ తరువాత వరుసగా గుంటూరు, విశాఖ జిల్లాలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఎదురవడంతో ఆయన పార్టీ పరిస్థితి చూసి చాలా ఆందోళన చెందారు.

 

అదే సమయంలో వైకాపా తన ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో నందమూరి కుటుంబానికి, పార్టీకి మధ్య చిచ్చుపెట్టడంతో ఆయన ఏవిధంగా స్పందించాలో తెలియని పరిస్థితుల్లో చిక్కుకొన్నారు. అయితే సరిగ్గా అప్పుడే బాలకృష్ణ రంగప్రవేశం చేసి వైకాపాకు, వారి వ్యుహలకు స్పందించని తన సోదరుడు హరికృష్ణకు, అతని కుమారుడు జూ.యన్టీఆర్ కు కొంచెం ఘాటుగానే జవాబు చెప్పి చంద్రబాబే తెదేపా నాయకుడని నిర్ద్వందంగా ప్రకటించి పార్టీలో నెలకొన్న అయోమయం దూరం చేసారు. ఆ తరువాతనే పార్టీ తిరిగి గాడిన పడిందని చెప్పవచ్చును.

 

అయితే వివిధ జిల్లా నేతల మద్య టికెట్స్ కోసం గొడవలు కొనసాగుతూనే ఉండటంతో, అసలు రాబోయే ఎన్నికలను ఎదుర్కొనే స్థితిలో ఉన్నామా లేమా? అనే అనుమానం కూడా వ్యక్తం చేసారంటే చంద్రబాబు ఎంతగా ఆందోళన చెందారో అర్ధం అవుతుంది. నేతలందరూ కుర్చీలలో కర్చీఫులు వేసి కూర్చొంటే పార్టీ టికెట్స్ దక్కవని అందరూ తమ విభేదాలు, స్వంత పనులను కూడా పక్కన బెట్టి పనిచేయకపోతే రాబోయే ఎన్నికలలో గెలవడం కష్టమని ఆయనే తేల్చి చెప్పారు.

 

ఆయన అంత కటువుగా చెప్పిన తరువాత నాయకులలో కూడా కొంత మార్పు కనబడింది. అంతవరకు పార్టీపై అలిగి దూరంగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు వంటి నేతలు దారిలోకి వచ్చి విశాఖలో పాదయాత్ర ముగింపు సభని అనుకొన్న దానికంటే ఘనంగా నిర్వహించారు. ఆ సభకు వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన కార్యకర్తలను, నేతలను, వేలాది ప్రజలను చూసిన తరువాత మళ్ళీ చంద్రబాబులో ఆత్మవిశ్వాసం, పార్టీ విజయం పట్ల నమ్మకం ప్రస్పుటంగా కనిపించాయి.

 

కొద్ది రోజుల క్రితం దాడి వీరభద్ర రావు, ఈరోజు కడియం శ్రీహరి ఇద్దరూ కూడా పార్టీని వీడినప్పటికీ, చంద్రబాబు “నేతలు పార్టీని వదిలిపోయినంత మాత్రాన్న మనమేమి భయపడనవసరం లేదు. పార్టీ కార్యకర్తలనుండి కొత్త నాయకులను మనం తయారు చేసుకొందాము. దానివల్ల పార్టీ మరింత బలపడుతుందని ధృడంగా చెప్పడం పార్టీ నేతలకు సైతం ఆశ్చర్యం కలిగించింది. అంతే కాకుండా “పార్టీనుండి ఇంకా ఎంతమంది బయటకి పోవడానికి సిద్దంగా ఉన్నారో వారి పేర్ల లిస్టు కూడా తనవద్ద సిద్దంగా ఉందని, వారు కూడా వెళ్ళిపోతే కొత్త టీమును ఏర్పాటు చేసుకొంటానని” ఆయన చెప్పడం ఆయనలో స్పష్టమయిన మార్పు వచ్చినట్లు తెలియజేస్తోంది.