బాబు పాదయాత్ర అనివార్యమా?

 

నిన్న జరిగిన చిన్న ప్రమాదంలో చంద్రబాబు కుడి కాలు బెణికినప్పటికీ ఆయన దాదాపు ఒక కిమీ దూరం నడిచి, కాలు నొప్పి ఎక్కువ అవడంతో తన పాదయాత్ర నిలిపివేయక తప్పలేదు. కానీ, ఎన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నపటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిర్ణయించుకొన్నారు.


అయితే, అయన ఆరోగ్యం పణంగా పెట్టి మరీ పాదయాత్ర చేయవవలసిన క్లిష్ట పరిస్థితులు పార్టీలో కానీ, రాష్ట్రంలో గానీ ఉన్నాయా? తీవ్ర ఆరోగ్య సమస్యలతో కూడా ఆయన తన పాదయత్ర కొనసాగించడం అంత అత్యవసరమా? అని ఆలోచించుకోవలసింది ఆయనే. ఏ పాదయాత్రతో ఆయన పార్టీని పటిష్టపరచి తిరిగి అధికారంలోకి రావలనుకొంటున్నారో, రేపు అదే పాదయాత్ర ఆయనను మంచం ఎక్కిస్తే ఆయన ఈ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆయన గ్రహించాలి. పార్టీలోఉన్న అనేక మంది అతిరధమహారధులను సమన్వయపరచి, వారికి పార్టీని పటిష్టపరిచే బాధ్యతలు అప్పగించి, తను కేవలం పర్యవేక్షణకే పరిమితమయి ఉండి ఉంటే, బహుశః తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వెల్లివిరిసి ఉండేదేమో. కానీ, ఆయనను ఆపని చేయకుండా ఆపుతున్న కారణాలేమిటో ఆయనకు, ఆ పార్టీ నేతలకే తెలియాలి. బహుశః అది ప్రజలకు, రాజకీయ వర్గాలలో తప్పుడు సంకేతాలు అందిస్తుందని ఆయన అభిప్రాయం కావచ్చును. తన సారధ్యంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలనే ప్రయత్నంలో చంద్రబాబు అవసరమయిన దానికన్నా ఎక్కువే శ్రమ పడుతున్నారని చెప్పవచ్చును.


గతంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, పాదయత్ర చేయడం ద్వారానే ముఖ్యమంత్రి కావాలనే తన కలను సాకారం చేసుకొన్నారు గనుక, ఇప్పుడు, తమ పార్టీలను తిరిగి అధికారంలోకి తీసుకురావాలంటే తప్పనిసరిగా పాదయాత్రలు చేయాలనే ఒక అపోహ మన రాజకీయపార్టీలలో ఏర్పడినందునే చంద్రబాబు, షర్మిలా ఇద్దరూ కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయక పాదయాత్రలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ఆలోచనే సరయినదనుకొంటే, ఏ పాదయాత్రలు చేయని కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదని భావించవలసి ఉంటుంది.


ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న కారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడే ప్రయత్నంలో షర్మిల పాదయత్ర చేయడం సమజసం అనుకోవచ్చును. కానీ, అటువంటి సమస్యలు లేని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమత మవుతూ కూడా పాదయాత్ర కొనసాగించవలసిన అవసరం ఉందా అని ఆయన, పార్టీ నేతలే ఆలోచించుకోవాలి.

Related Segment News