సెంచరీ చేసిన 63 ఏళ్ళ యువకుడు, చంద్రబాబు!

 

ఆరోగ్యవంతులయిన యువకులు కూడా చేయ సాహసించని ఒక బృహత్ కార్యక్రమానికి 63 ఏళ్ళ యువకుడు అని చెప్పుకోవలసిన చంద్రబాబు నాయుడు చేసారు. సరిగ్గా వంద రోజుల క్రితం అనంతపురం జిల్లాలో హిందూపూర్ నుండి ‘వస్తున్నా మీ కోసం’ అంటూ పాదయాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు ఇంతవరకు 9 జిల్లాలలో ఏకదాటిగా నడుస్తూ మారుమూల గ్రామాలను సైతం పర్యటించారు. అక్కడి ప్రజల కష్టనష్టాలు తెలుసుకొంటూ, వారితో మమేకమవుతూ ముందుకు సాగుతున్న చంద్రబాబు నిన్నటితో తన వరంగల్ జిల్లా పాదయాత్ర ముగించుకొని ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టారు.

 

ఇంతవరకు చంద్రబాబు నాయుడు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 88 మండలాలు, 13 మునిసిపాలిటీలు, 683 గ్రామాలు సందర్శించారు. అనంతపురం జిల్లాలో 252 కి.మీ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో 200 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 120 కిలోమీటర్లు నడిచారు.

 

ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ సీనియర్ నేతలు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కోటేశ్వర రావు తదితరులు మాదిరాపురం గ్రామంలో దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి వంద రోజుల పాదయాత్ర ప్రతీకగా వందఅడుగుల ఎత్తుగల ఒక విజయ స్థూపాన్నికూడా నిర్మిస్తున్నారు. చంద్రబాబు దానిని అవిష్కరించిన తరువాత, అక్కడే ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. ఈ సందర్భముగా పార్టీ సీనియర్ నేతలందరూ కూడా సభలో పాల్గోనవచ్చునని సమాచారం. వీరే గాకుండా బాలకృష్ణ, లోకేష్ తదితరులు కూడా పాల్గొనవచ్చును. నిన్నరాత్రి ఖమ్మం జిల్లాలో మాదిరాపురం గ్రామంలో గల మిషనరీస్ కళాశాలలో బసచేసిన చంద్రబాబు, అదే కళాశాల ఆవరణలోనే రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశం నిర్వహిస్తారు. సీనియర్ నేతలందరూ పాల్గొనే ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల, సహకార సంస్థలెన్నికలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహాల గురించి చర్చిస్తారు. ఆ తరువాత స్థానిక సమస్యలు, విద్యుత్ ధరల పెంపు వంటి ఇతర సమస్యలను కూడా చర్చిస్తారు.

 

 పార్టీ అధ్యక్షుడు స్వయంగా తమ జిల్లాలో ఇన్ని రోజులు పర్యటిస్తునందున, ఈ పర్యటనద్వారా పార్టీకి వీలయినంత ఎక్కువ ప్రయోజనం చేకూరే విదంగా స్థానిక నేతలు అయన పర్యటిస్తున్న మార్గంలో అనేక సభలు, సమావేశాలకు రూపకల్పన చేసారు. అదేవిదంగా పార్టీ అధ్యక్షుడితో కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమాలకి కూడా ఏర్పాటు చేసి, పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా అనేక పధకాలు తయారు చేసారు.

 

చంద్రబాబు ఖమ్మం జిల్లాలో దాదాపు 102కిమీ. పాద యాత్ర చేసి ఈ నెల 15వ తేదిన జగ్గయపేట నుండి తన కృష్ణజిల్లా పాదయాత్ర ప్రారంబిస్తారు.

 

ఇంతవరకు స్థానిక ప్రజలో తెలుగుదేశం పార్టీ తెలంగాణా వ్యతిరేఖమనే భావనను తన యాత్ర ద్వారా చంద్రబాబు పూర్తిగా తుడిచిపెట్టేయడమే గాకుండా, తెలంగాణా జిల్లలో నిర్వీర్యమయిన తన పార్టీ క్యాడర్ ను కూడా పునరుజీవింపజేసుకొన్నారు. అదే సమయంలో చంద్రబాబు స్వయంగా మారు మూల గ్రామాలను సైతం పర్యటించడం వల్ల స్థానిక సమస్యల పట్ల అవగాహన పెంచుకోవమే గాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలను కూడా అయన స్వయంగా కలుసుకొని వారి సాధక బాధకాలు తెలుసుకోగలిగేరు.

 

 
ఈ యాత్ర వల్ల తెలుగుదేశం మరో విదంగా కూడా చాల లాభపడిందని చెప్పవచ్చును. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన మొదలుగా రాష్ట్రాన్ని, దేశాన్నిపాలిస్తున్నకాంగ్రెస్ పార్టీ వరుసపెట్టి చేస్తున్న తప్పులను, చంద్రబాబు ప్రజల మద్యనే ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకి వివరిస్తూ, కాంగ్రెస్ పాలనను సమర్ధంగా ఎండగట్టగలిగేరు. నిత్యం సరికొత్త వివాదాలలో ఇర్రుకొంటూ, ఈ మూడు నెలల్లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబుకి ఆయన పాద యాత్ర చేస్తునంత కాలం కూడా చాలానే ఆయుధాలు అందజేస్తూ, అయన పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు పరోక్షంగా చాలా సహాయపడినందుకు చంద్రబాబు మరియు అయన పార్టీ కూడా కాంగ్రేసు పార్టీకి కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు.