సుమారు 5000 అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేసిన కేంద్రం

 

ఇప్పుడు ఇంటర్నెట్ సెల్ ఫోన్లకు కూడా విస్తరించడంతో దాని వలన ఎన్ని లాభాలు చేకూరుతున్నాయో అంతకంటే ఎక్కువ నష్టం కూడా జరుగుతోంది. ఇంటర్నెట్ లో వేలాదిగా అశ్లీల వెబ్ సైట్స్ వలన దేశంలో యువత పెడమార్గం పట్టుతోంది. అంతేకాదు అటువంటి వాటిని చిత్రీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల వలన సమాజంలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే కేంద్రప్రభుత్వం అశ్లీల వెబ్ సైట్లపై కొరడా జులిపించింది. వివిధ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఇంత వరకు సుమారు 5000 అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేసింది.

 

మొత్తం 32 మంది సర్వీస్ ప్రోవైడర్లను ఈ అశ్లీల వెబ్ సైట్లను నిషేదించమని కోరగా ఇంతవరకు కేవలం 8 మంది మాత్రమే స్పందించారు. దీని వలన న్యాయపరమయిన వివాదాలలో చిక్కుకొన వలసి వస్తుందనే ఉద్దేశ్యంతో మిగిలినవారిలో కొందరు తమకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే వాటిని నిలిపివేస్తామని స్పష్టం చేసారు. బ్లాక్ చేయబడిన అశ్లీల వెబ్ సైట్లు మళ్ళీ కొత్త ఐ.పి అడ్రస్ మరియు సరికొత్త పేర్లతో తమ కార్యక్రమాలను కొనసాగిస్తుండటంతో వాటిని కూడా నిషేదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.