షెడ్యూల్: 10 సంస్థల విభజనకు కేంద్రం జోక్యం అనివార్యం

 

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగడం ఇప్పుడు సర్వసాధారణమయిన విషయం అయిపోయింది. కొత్తగా షెడ్యూల్: 10 క్రిందకు వచ్చే సంస్థలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి గనుక అవన్నీ తమకే స్వంతమని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించడంతో రెండు రాష్ట్రాల మధ్య మరో యుద్ద బీజం పడింది. రాష్ట్ర విభజనజరిగిన తరువాత చాలా సంస్థలను రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు చేసినప్పటికీ కొన్ని సంస్థల విభజన చాలా సంక్లిష్టంగా ఉన్న కారణంగా వాటిని విభజన చట్టంలో షెడ్యూల్: 9 మరియు 10ల క్రిందకు చేర్చి వాటన్నిటినీ రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోగా అంటే జూన్ 2వ తేదీలోగా ఇరు రాష్ట్రాల మధ్య విభజించాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది.

 

కానీ ఏడాది గడిచినా షెడ్యూల్: 10లో సంస్థల విభజన ఇంకా పూర్తికాకపోవడంతో ఆ గడువు ముగిసిపోయింది కనుక తమ రాష్ట్రంలో ఉన్న ఆ సంస్థలన్నీ తమకే చెందుతాయంటూ తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. వాటి స్థిర, చర ఆస్తులు, ఆదాయం, ఉద్యోగులు అన్నీ తమకే చెందుతాయని పేర్కొంది. అందులో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తెలంగాణా ఉద్యోగులను నియమించాలని, ఆ సంస్థలకు వివిధ బ్యాంకులలో ఉన్న నగదు నిలువలు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోకుండా అన్ని అకౌంట్లను తక్షణమే స్తంబింపజేయాలని బ్యాంకులకు లేఖలు వ్రాయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ షెడ్యూల్ క్రిందకు వచ్చే ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిపై యాజమాన్య హక్కులను తెలంగాణాకే చెందుతాయని ఇదివరకు హైకోర్టు తీర్పు ఇచ్చింది కనుక అదే ప్రాతిపదికన ఆ షెడ్యూల్లో మిగిలిన అన్ని సంస్థలు కూడా తమకే చెందుతాయని తెలంగాణా ప్రభుత్వ వాదన.

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పోటీగా కొన్ని సంస్థలకు ఉన్నతాధికారులను నియమించింది. కానీ పరిస్థితి చెయ్యి దాటుతున్నట్లు గమనించగానే దీని గురించి కేంద్రానికి పిర్యాదు చేసి తక్షణమే జోక్యం చేసుకోవలసిందిగా కోరింది. దానిపై స్పందించిన కేంద్రం ఈ సంస్థల విభజన గడువును మరి కొన్ని నెలలకు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సంస్థల విభజనకు ప్రత్యేకంగా కొన్ని టాస్క్ కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతోందని సమాచారం.

 

కానీ “ఈ సంస్థల పంపకానికి తాము అంగీకరించబోమని తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టప్రకారం ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొనేందుకు అవకాశముంటే అందుకు మేము అంగీకరిస్తాము కానీ గడువు ముగిసిన తరువాత ఇంకా ఆ సంస్థలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పంచుకొనేందుకు మేము సిద్దంగాలేమని” ఆయన తెలిపారు. ఉమ్మడి ఆస్తులయిన ఈ సంస్థలన్నిటినీ తెలంగాణా ప్రభుత్వం ఏకపక్షంగా స్వంతం చేసుకొనేందుకు తాము కూడా అంగీకరించబోమని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కనుక ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం అనివార్యమవుతుంది.