పోలవరంపై మాటలకే పరిమితం చేసిన కేంద్రం... ఏపీ ప్రభుత్వానికి నిధులు ఆపేశారు!!

 

పోలవరం ప్రాజెక్టు విషయంలో రోజుకో చిక్కుముడి బయటపడుతుంది. ఇది జాతీయ ప్రాజెక్టా లేక కేంద్రం ప్రత్యేకంగా చూసే ప్రాజెక్టా అర్థం కాక రాష్ట్ర ప్రభుత్వ అధికారులే తలలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణకు కేంద్రమే నియమించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉనికిని కూడా లేదు. పీపీఏ సిబ్బంది జీతభత్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేసేస్తున్నామని చెబుతూ కేంద్ర ఆర్థిక శాఖ సవాలక్ష నిబంధనలు పెడుతుంది. 2014 కి ముందు ప్రాజెక్టుకి ఖర్చు చేసిన మొత్తానికీ కాగ్ ఆడిట్ నివేదిక ఇవ్వాలని షరతు విధిస్తుంది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు పంపిన ఆఫీసు మెమోరాండం చూశాక భవిష్యత్తులో పోలవరానికి నిధులు రావడం పై ఆశలు సన్నగిల్లుతున్నాయని నిపుణులంటున్నారు. 

పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి ఇప్పటి దాకా వచ్చిన నిధులు భవిష్యత్ లో రావలసిన నిధులపై రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుంది. ఇప్పటి దాకా 6,727 కోట్లు విడుదలయ్యాయని ఇంకా 5,072 కోట్లు రియంబర్స్ కావలసి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 1,850 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ నుంచి వర్తమానం అందింది. ఈ నెల 8 న జలశక్తి శాఖకు ఆర్థిక శాఖ పంపిన ఆఫీసు మెమోరాండంలో పలు కీలక అంశాలు కనిపించాయి. కేంద్ర బడ్జెట్ లో పోలవరానికి కేటాయింపులు లేవని అందులో ఆర్థిక శాఖ తెలిపింది. నాబార్డు ద్వారా రుణం సాయం పొంది జలశక్తి శాఖ ద్వారా పీపీఏ కు దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని గతంలో ఇదే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. బడ్జెట్ లో ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ప్రధాన అవరోధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా కేంద్ర బడ్జెట్ లో నిర్ణీత మొత్తాన్ని కేటాయిస్తే సమయానుకూలంగా నిధులు ఎక్కువగా తీసుకునేందుకు వీలుంటుందని అంటుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 2020-21 బడ్జెట్ లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలనుకుంటుంది. 

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాక పీపీఏ ఏర్పడింది. అయితే పిపిఎతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. తమతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్రాన్ని ఎప్పట్నుంచో పీపీఏ కోరుతోంది. జలశక్తి శాఖ దానిని ప్రత్యేకంగా గుర్తించక పోవడంతో ఈ సంస్థతో ఎలా ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరాన్ని ప్రత్యేకంగా చూస్తూ జాతీయ జల అభివృద్ధి సంస్థ ద్వారా గాక నేరుగా రాష్ట్రానికే నిధులు మంజూరు చేసేలా ఒత్తిడి పెంచాలనే ఆలోచనలో జల వనరుల శాఖ ఉంది. గతంలో ఏఐబీపీ కింద చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం మేర నిధులు వెచ్చిస్తుండేది.  ఇందులో పోలవరం ప్రాజెక్టు కూడా ఉండేది. కానీ 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఈ ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. ఆ తర్వాత ప్రాజెక్టు మొత్తానికి అయ్యే వ్యయం అంతటిని తానే భరిస్తానని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో అప్పుడప్పుడు కొంత ఇవ్వడం తప్ప ప్రాజెక్టు కోసం అంటూ ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు కేంద్రం. అంతేకాదు ప్రాజెక్టుకు సంబంధించిన సహాయ పునరావాస అంచనాల పై కేంద్ర ఆర్థిక శాఖ అడిగిన ప్రశ్నలే పదేపదే అడుగుతుంది. ప్రాజెక్టు టెండర్లు పనుల అప్పగింత పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిపుణుల కమిటీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి చెల్లింపుల్లో అక్రమాలు జరగలేదని రుజువయ్యాకే భవిష్యత్ లో నిధులు మంజూరు చేయాలని ఆఫీసు మెమోరాండంలో ఆర్థిక శాఖ తేల్చి చెప్పడంతో జలవనరుల వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.