ఆ మందులని ఎందుకు నిషేధించారు

 

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అన్నా అనకపోయినా, నిత్యం నిండు ఆరోగ్యంతో ఉండాలన్న కోరిక ఎవరికైనా ఉండేదే! అందుకే శరీరానికి ఏ చిన్నపాటి తేడా వచ్చినా కంగారుపడిపోతాం. కొన్ని దశాబ్దాల క్రితమైతే, రోజువారీ వచ్చే ఆరోగ్య సమస్యలకి మన వంటింట్లోనే కావల్సినన్ని మందులు దొరికేవి. కానీ ఇప్పుడు దగ్గు వస్తే కరక్కాయ చప్పరించమని, కడుపునొప్పికి వాము నమలమనీ... ఒకో రోగానికి, ఒకో చిట్కా చెప్పేవారు లేరు. చెప్పినా పట్టించుకునేవారూ లేరు! అంత సమయమూ, సహనమూ ఇప్పుడు ఎవరికీ లేవు. అందుకే ఒంట్లో ఏమాత్రం తేడా వచ్చినా సెంటర్లో ఉన్న పదీపదిహేను మందుల షాపులలో ఏదో ఒక షాపులోకి దర్జాగా వెళ్లిపోయి, ఫలానా మందు కావాలని అడిగి తీసుకుంటాం. ఈ విషయంలో మన వైద్య పరిజ్ఞానం చాలా అసాధారణం. ఏ రోగానికి ఏ మందు వేసుకుంటే సరిపోతుందా ఖచ్చితంగా చెప్పేయగలం! కానీ గతవారం ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఒకటీరెండూ కాదు.... ఏకంగా 344 మందులు నిషేధించేసరికి మన్ముందు మన మహత్తరమైన వైద్యపరిజ్ఞానాన్ని మరింత విస్తరించక తప్పని పరిస్థితి వచ్చింది.

 

ప్రభుత్వం విధించిన ఈ నిషేధం గురించి చదువుతున్నప్పుడు తరచూ కనిపిస్తున్న మాట... ‘fixed dose combination’ (FDC). అంటే ఓ రెండు మూడు రకాల ఔషధాలని ఎడాపెడా కలిపేసి, వాటికి ఓ కొత్త పేరుని తగిలించి మార్కెట్‌లోకి విడుదల చేయడమన్నమాట! ఇలా జ్వరం, దగ్గు, నొప్పి... లాంటి సమస్యలకే కాదు, మానసిక క్రుంగుబాటు వంటి తీవ్రమైన సమస్యలకి కూడా మన దేశంలో FDC మందులు విస్తృతంగా లభిస్తున్నాయి. వీటిలో చాలామందులకు Central Drugs Standard Control Organisation (CDSCO) అనుమతి లేనేలేదు. ఒక్క నొప్పిని నివారించే మాత్రలలోనే 73 శాతం మందులకు మన దేశంలో అనుమతి లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించవచ్చు. వీటిలో చాలా రకాల FDCలకు విదేశాలలో అనుమతే లేదు.

 

FDCలను నిషేధించేందుకు ఆరోగ్య శాఖ చూపిస్తున్న కారణాలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. రకరకాల మందులను రకరకాల మోతాదులలో ఎడాపెడా తీసుకోవడం వల్ల, అవి శరీరాన్ని విషమయం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. మున్ముందు రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, యాంటీబయాటిక్‌ మందులకు శరీరం స్పందించకపోవడం మొదల్కొని శరీర భాగాలు పనిచేయకపోవడం వరకూ నానా రకాల ప్రమాదాలూ పొంచి ఉన్నాయంటున్నారు. దురదృష్టం ఏమిటంటే... సదరు దుష్ప్రభావాలు ఏర్పడినప్పుడు కూడా అవి తాను తరచూ వాడే మందుల వల్లే అని రోగులు తెలుసుకోలేకపోవడం! రోగి తరచూ వాడుతున్న మందుల వల్లే ఈ దుస్థితి అని గ్రహించే స్థితిలో వైద్యులు కూడా లేకపోవడం. అందుకనే ఔషధి కంపెనీల ఆటలు నిరాటంకంగా చెల్లిపోతూ వచ్చాయి. తాము ఉత్పత్తి చేస్తున్న మందుని ఇన్నాళ్లూ ఎవరూ వేలెత్తి చూపలేకపోయారు కదా! అంటూ సదరు ఔషధి కంపెనీలు ఇప్పుడు కూడా వితండవాదం చేస్తున్నాయి.

 

నిజానికి FDCలకు ‘కేంద్ర ఔషధి నియంత్రణ సంస్థ’ (CDSCO) అనుమతి తప్పనిసరిగా ఉండాలన్న నియమం 1961 నుంచే ఉంది. కానీ ఈ నియమాన్ని తుంగలో తొక్కిన వందలాది మందులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అసలు CDSCO అనుమతించిన మందులు కూడా కొన్ని పనికిరానివన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయినా ఇన్నాళ్లూ ఆరోగ్య శాఖ పట్టిపట్టనట్లు ఊరుకుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం నిద్రాణస్థితిలో ఉండటంతో మన దేశంలోని ఔషధివ్యాపారం లక్షకోట్లను దాటిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదిల్చాలనుకునే సమయానికి, ఔషధిరంగం అదుపుచేయజాలనంత బలాన్ని పుంజుకుంది. ఈ మందులను ఉత్పత్తి చేసే కంపెనీలు భారతీయులు సొమ్ముని దండుకుంటూనే, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఉదాహరణకు అమెరికాకు చెందిన అబాట్‌ అనే కంపెనీ Phensedyl, ఫైజర్ అనే కంపెనీ Corex అనే దగ్గుమందులను తయారుచేస్తున్నాయి. భారతదేశంలోని దగ్గుమందులలో మూడో వంతుకి పైగా ఆధిపత్యం ఈ రెండు మందులనే అంటే నమ్మశక్యం కాదు. Codeine అనే మత్తుమందు కలిపిన ఈ దగ్గుమందు వల్ల, దీన్ని తాగిన మనిషిలో ఉత్తేజం పెరుగుతుంది. కానీ నిజానికి దీని వల్ల దగ్గు తగ్గదనీ... కొన్నాళ్లకు దగ్గు సహజంగా తగ్గిపోవడంతో వీటి వల్లే గుణం కనిపించిందని రోగి అనుకుంటాడని కొందరి విమర్శ. కేవలం ఈ దగ్గుమందులో ఉన్న మత్తుమందు కోసం, దాన్ని సేవించే వ్యసనపరుల సంఖ్య కూడా అసాధారణంగానే ఉంది.

 

జరిగిందేదో జరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవడం ఒక శుభసూచకమే! కానీ తాము అమలు చేయాలనుకున్న నిషేధం విషయంలో ప్రభుత్వం ఎంతమేరకు విజయం సాధిస్తుందో చూడాలి. కోట్లాదిగా మూలుగుతున్న డబ్బు, న్యాయాన్ని ఏమార్చగల పలుకుబడి ఉన్న సదరు ఔషధి సంస్థలతో ఢీకొని, ప్రభుత్వం తన పంతాన్ని ఎంతవరకు నెగ్గించుకోగలదో చూడాలి. వైద్య వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న అపనమ్మకం కూడా ఈ స్థితికి ఓ కారణమే. చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కూడా దగ్గర్లో ఉన్న వైద్యుని సలహా తీసుకునేందుకు రోగులు భయపడుతున్నారు. ఎంత డబ్బు గుంజుకుంటారో, ఎలాంటి రోగనిర్ధరణ పరీక్షలు రాస్తారో అని వణికిపోతున్నారు. ఆర్‌.ఎం.పీ వైద్యులు, ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ నశించి... ఖరీదైన స్పెషాలటీ డాక్టర్లే ఇప్పడు మనకి దిక్కయ్యారు. వాళ్లు చెప్పిందే రోగం, వాళ్లు చేయించుకోవాలన్నదే పరీక్ష, వాళ్లు ఇచ్చిందే మందుగా ఆట సాగుతోంది. ఈ ఆటలను కట్టేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. అప్పటివరకూ సగటు భారతీయుడు, ఏదో ఒక అనారోగ్యం ఏర్పడితే... ఏదో ఓ మందుని తీసుకోక మానడు!