TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు

Published on: Fri May 30, 2025 10:04AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ నంబర్ వన్ గా నిలబెట్టడమే తన లక్ష్యమని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కడప వేదికగా జరిగిన మహానాడు ముగింపు సందర్భంగా గురువారం  (మే29) సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సుమాలను పూయిస్తానన్నారు. రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదన్న చంద్రబాబు.. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని చెప్పారు. మహానాడు వేదికగా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. సీమ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షనిజమే అన్న ఆయన ఈ విషయాన్ని ఆనాడే గుర్తించామని చెప్పారు. సీమ గడ్డపై ఫ్యాక్షన్ ఉండొద్దనే తాను కఠినంగా వ్యవహరించానని గుర్తు చేశారు.  

సీమ అభివృద్ధికి తన వద్ద  ప్రత్యేక బ్లూప్రింట్ ఉందని చెప్పిన ఆయన విద్యా సంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు  పారిశ్రామిక కారిడార్లతో  సీమలో ఏ జిల్లాకు ఏం చెయ్యాలన్నదానిపై పక్కా ప్రణాళిక ఉందన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఇఈర్, ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూని వర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు తీసుకువచ్చామన్నారు. కడపలో హజ్ హౌస్ మొదలుపెట్టి 90 శాతం నిర్మిస్తే... గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదన్నారు.

ఇప్పుడు ఆ హజ్ హౌస్ ను 6 నెలల్లో హజ్ హౌస్ పూర్తి చేస్తామని చెప్పారు.  లేపాక్షి - ఓర్వకల్ కారిడార్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు.  కడప స్టీల్ ప్లాంట్‌కు గతంలో తాను శంకుస్థాపన చేశాననీ, దానికే మళ్లీ భూమిపూజ చేసి జగన్ నాటకాలాడారనీ చెప్పిన చంద్రబాబు  వచ్చే నెల 12 లోగా  కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఫేజ్ 1లో రూ.4,500 కోట్లతో, ఫేజ్ 2లో మరో రూ.4,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామనీ, దీనిని పూర్తి చేసి 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ హామీ ఇచ్చారు.