ఒకవేళ జగన్ బెయిల్ రద్దయితే... సీఎం పీఠమెక్కేది విజయమ్మా? భారతా? 

 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సుదీర్ఘకాలంగా బయటున్నవాళ్ల బెయిల్ రద్దుచేసి నాలుగు వారాల్లో జైలుకు పంపాలని సుప్రీం ఆదేశించిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే, కేంద్ర హోంశాఖ పేరుతో మరో వార్త సర్క్యులేట్ అవుతోంది. సీరియస్ కేసుల్లో బయటున్న నిందితుల బెయిల్స్ రద్దు కోసం కోర్టుల్లో పిటిషన్ వేయాలంటూ సీబీఐ, ఈడీలను కేంద్ర హోంశాఖ ఆదేశించిందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇందులో జగన్ పేరు కూడా ఉందని, దాంతో మళ్లీ జైలుకెళ్లడం ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు నో చెప్పడంతో... త్వరలోనే బెయిల్ కూడా రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ వేసే అవకాశముందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక, టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కూడా ఇలాంటి పోస్టే ఒకటి పెట్టారు. జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ పావులు కదుపుతోందని, విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిని కేంద్రం సున్నితంగా తిరస్కరించిందంటూ ట్వీట్ చేశారు.

జరుగుతున్న ప్రచారంలో నిజముందో లేదో తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి... తన సతీమణితో కలిసి గవర్నర్ ను కలవడంపైనా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒకవేళ బెయిల్ రద్దయి... జగన్ జైలుకెళ్తే... భారతిని ముఖ్యమంత్రి చేస్తారని, అందుకే... ముందుగా గవర్నర్ కు పరిచయం చేశారని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, భారతిని పాలనా వ్యవహారాల్లో ఇన్ వాల్వ్ చేస్తున్నారని, శిక్షణ కూడా ఇప్పిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక, ఇటీవల కేసీఆర్ కూడా... మూడు నాలులు నెలల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే బెయిల్ రద్దయి జగన్ జైలుకెళ్తే... విజయమ్మ ముఖ్యమంత్రి అవుతుందే కానీ... భారతిని ఎంచుకోకపోవచ్చని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, సీబీఐ ఒకవేళ బెయిల్ రద్దు చేయాలని కోరినా... కోర్టు అంత త్వరగా అంగీకరించే పరిస్థితి ఉండదని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.